NTV Telugu Site icon

AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్‌ భేటీ.. కీలక అంశాలపై ఫోకస్‌

Ap Cabinet

Ap Cabinet

AP Cabinet Meeting: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు కేబినెట్‌ సమావేశం జరగనుంది.. సాయంత్రం 4గంటలకు వెలగపూడిలోని సచివాలయంలో ఈ భేటీ జరగనుంది. రూ.85 వేల కోట్ల పెట్టుబడులపై ఎస్‌ఐపీబీ భేటీలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది. రాజధాని అమరావతికి సంబంధించి గతంలో కాంట్రాక్టర్లకు కేటాయించిన పనుల టెండర్ల రద్దుకు ఈ కేబినెట్‌లో ఆమోదం తెలుపనున్నారు. ఆయా పనులకు సంబంధించి కొత్త టెండర్లు పిలిచే విషయంపై ఈరోజు జరగబోయే కేబినెట్‌లో చర్చించి.. తర్వాత వాటికి ఆమోదం తెలపనున్నారు. ఈనామ్ భూముల అంశంపై నిర్ణయం తీసుకోనుంది. సూపర్‌ సిక్స్‌ హామీల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపైనా ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏపీఎస్ఆర్టీసీలో మహిళల ఉచిత ప్రయాణంపై ఆర్టీసీ అధికారులు ఇప్పటికే ప్రణాళికలు సిద్దం చేసినట్లు సమాచారం.

Read Also: CM Revanth Reddy: నేడు వేములవాడకు సీఎం రేవంత్‌.. ఆలయ అభివృద్ధికి రూ. 127 కోట్లు

ఇక, ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్ జరిగింది. ప్రభుత్వం ఏర్పడిన తరువాత జరిగిన తొలి మీటింగ్‌లో పెట్టుబడులు, ఒప్పందాలపై చర్చించారు. గడిచిన 5 నెలల్లో వివిధ పెట్టుబడుల ప్రతిపాదనలు, ఒప్పందాలపై సమీక్ష జరిపారు. మొత్తం 10 సంస్థలకు సంబంధించి 85 వేల 83 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. ఈ పెట్టుబడుల ద్వారా 33 వేల 966 ఉద్యోగాలు రానున్నాయి. భారీ పరిశ్రమలకు భూముల కోసం ల్యాండ్ పూలింగ్ విధానం చేపట్టాలన్నారు సీఎం చంద్రబాబు. పరిశ్రమలకు భూములు ఇచ్చే వారికి స్కిల్ డెవల్మెంట్ ద్వారా అదే సంస్థలో ఉద్యోగ, ఉపాధి కల్పించేలా ప్రతిపాదనలు కూడా సిద్ధంచేశారు. ఇక, పరిశ్రమ వర్గాల అవసరాలతో పాటు.. భూములు ఇచ్చే ప్రజల సంక్షేమం కూడా చూడాల్సి ఉంటుందన్నారు సీఎం చంద్రబాబు. అర్సెలార్ మిత్తల్ స్టీల్ ప్లాంటుకు అవసరమైన భూములు సేకరించాలన్నారు. ఇందుకోసం ల్యాండ్ పూలింగ్ విధానాన్ని పాటించాలని సూచించారు. అర్సెలార్ మిత్తల్ స్టీల్ ఫ్యాక్టరీ ద్వారా ప్రత్యక్షంగా 61 వేల మందికి పరోక్షంగా లక్షల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు 4 ఏళ్లలో కార్యరూపం దాల్చేలా చూడాలని మంత్రులకు సూచించారు సీఎం చంద్రబాబు. మొత్తానికి…రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడులతో పాటు ఉద్యోగాలు కల్పించడం కూడా ప్రధాన ధ్యేయంగా పెట్టుకుంది ఏపీ ప్రభుత్వం. ఇక, ఈ రోజు సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనున్న కేబినెట్‌ సమావేశంలో ఆమోదముద్ర వేయనున్నారు..