BC Reservations: త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు (బీసీలు) సముచిత గౌరవం, ప్రాతినిధ్యం కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం సంకల్పించిందని తెలిపారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ సమర్పించిన నివేదికపై చర్చించిన అనంతరం కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. నేటి కేబినెట్ సమావేశానికి ప్రత్యేకత ఉందని పేర్కొన్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి బీసీ వర్గాలు పార్టీకి అండగా నిలుస్తున్నాయని, ఆ వర్గాలకు ఎంత చేసినా తక్కువేనని అన్నారు. గతంలో బలహీన వర్గాలకు సరైన రిజర్వేషన్లు ఉండేవి కావని గుర్తుచేశారు. దివంగత ఎన్టీఆర్ బీసీలకు 20 శాతం రిజర్వేషన్లు కల్పించారని, 1995లో పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు చేసి చంద్రబాబు అదనపు రిజర్వేషన్లు అందించారని తెలిపారు. అయితే, గత వైసీపీ ప్రభుత్వం ఎన్టీఆర్, చంద్రబాబు కల్పించిన రిజర్వేషన్లను తగ్గించిందని ఆరోపించారు.
బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలంటే ప్రత్యేక డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలని గతంలో హైకోర్టు సూచించిందని వివరించారు అచ్చెన్నాయుడు. ఈ నేపథ్యంలో రాజీవ్ రంజన్ మిశ్రా, ఐఏఎస్ అధ్యక్షతన ఫిబ్రవరి 19న బీసీల కోసం స్వతంత్ర ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది మార్చి 23 నుంచి కమిషన్ తన కార్యకలాపాలను ప్రారంభించిందన్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించి, వివిధ బీసీ కుల సంఘాల నుంచి విజ్ఞప్తులు, అభిప్రాయాలను సేకరించిందని పేర్కొన్నారు. దాదాపు 7 నెలల పాటు వివిధ స్థాయిల్లో సమగ్ర అధ్యయనం నిర్వహించిన కమిషన్ ఆగస్టు 14న ప్రభుత్వానికి నివేదిక సమర్పించిందని వెల్లడించారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను సమకాలీన డేటా, ప్రస్తుత స్థానిక పరిస్థితులు, జనాభా ప్రాతిపదికన మాత్రమే ఖరారు చేసినట్లు తెలిపారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని కమిషన్ నివేదికలో పొందుపరిచిందని, ఆ నివేదికను పరిశీలించిన కేబినెట్ ఆమోదించిందని వివరించారు.
స్థానిక సంస్థల్లో వివిధ పదవులకు బీసీలకు కల్పించనున్న రిజర్వేషన్ల వివరాలను మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. గ్రామ పంచాయతీ వార్డులకు 26.73 శాతం, సర్పంచ్ పదవులకు 27 శాతం, ఎంపీటీసీ స్థానాలకు 25 శాతం, ఎంపీపీ పదవులకు 24 శాతం, జడ్పీటీసీ స్థానాలకు 26 శాతం, జడ్పీ చైర్మన్ పదవులకు 23 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు తెలిపారు. మున్సిపల్ చైర్‌పర్సన్లు, మేయర్లు, వైస్ చైర్మన్లకు 34 శాతం రిజర్వేషన్లు ఉంటాయని పేర్కొన్నారు. రిజర్వేషన్లకు సంబంధించిన జాబితాను రేపు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు సముచిత స్థానం కల్పించడంతో పాటు, పార్టీ పరంగా కూడా 34 శాతం ప్రాతినిధ్యం కల్పిస్తామని స్పష్టం చేశారు. అవసరమైన చోట 34 శాతానికి మించి బీసీలకు పదవులు కల్పించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. బీసీలకు రాజకీయంగా తగిన ప్రాధాన్యం కల్పించడం, వారి ప్రాతినిధ్యాన్ని పెంచడం ఎన్డీఏ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు మంత్రి అచ్చెన్నాయుడు.

