AP Assembly Budget Session: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఉదయం పది గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. తర్వాత అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు నేతృత్వంలో బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం జరుగుతుంది. సభ ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై BACలో నిర్ణయం తీసుకుంటారు. ఇక 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ఈ నెల 28న సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇక, అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ అధినేత జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా హాజరుకానున్నారు. తమను చూసి ప్రభుత్వం భయపడుతోందంటున్న వైసీపీ… అందుకే సభను ఏకపక్షంగా నడపాలని చూస్తుందని ఆరోపించింది. తమ అధినేత వైఎస్ జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని డిమాండ్ చేయనుంది. అలాగే, ఎన్నికల హామీలు సహా పలు అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని వైసీపీ భావిస్తుంది. దీంతో సభ హాట్‌హాట్‌గా సాగే అవకాశం ఉంది.
Read Also: America : అమెరికా నుండి బహిష్కృత వలసదారులతో ఢిల్లీలో ల్యాండ్ అయిన మరో విమానం
ఎన్నికల కోడ్ కారణంగా ఈ సారి వెంకటపాలెంలోని NTR విగ్రహనికి నివాళులు అర్పించే కార్యక్రమాన్ని రద్దు చేసుకుంది టీటీడీ.. అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు ముందుగా NTR విగ్రహానికి నివాళులు అర్పించి సభకు హాజరవుతారు నేతలు. కానీ… కోడ్ ఉండడంతో ఈ కార్యక్రమం రద్దు చేసుకున్నారు.. నేరుగా అసెంబ్లీకే రానున్నారు టీడీపీ సభ్యులు.. మరోవైపు… ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో మంగళగిరి కేంద్ర కార్యాలయంలో జనసేన శాసన సభాపక్ష సమావేశం జరిగింది. అసెంబ్లీ, శాసన మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు పవన్ కల్యాణ్.. అసెంబ్లీ సమావేశాలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. DGP సహా పలువురు ఉన్నతాధికారులతో భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని YCP నిర్ణయించడంతో ఈ సారి బడ్జెట్ సెషన్ హాట్‌హాట్‌గా సాగనుంది.
