AP Alliance Seat Sharing: ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి స్థానిక ఎన్నికలకు సంబంధించి సీట్ల సర్దుబాటుపై కసరత్తును పూర్తి చేశారు.. ముఖ్యమంత్రి చంద్రబాబుతో మంత్రి నాదెండ్ల మనోహర్, మంత్రి సత్యకుమార్, ఎంపీ లింగమనేని రమేష్ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై చర్చించారు.. స్థానిక ఎన్నికల్లో ఏ పార్టీ ఎక్కడ పోటీ చేయాలనే అంశంపై టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు స్పష్టతకు వచ్చినట్లు సమాచారం. సీట్ల పంపకాలపై కూటమి పార్టీల మధ్య చర్చలు కొలిక్కి రావడంతో, పోటీ చేసే స్థానాల వివరాలను కాసేపట్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇప్పటికే స్థానిక ఎన్నికల్లో మూడు పార్టీలు ఐక్యంగా ముందుకు సాగాలని కూటమి నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సీట్ల సర్దుబాటుతో పాటు అభ్యర్థుల ఎంపికపైనా నేతలు దృష్టి సారించారు. సీట్లకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత, ఆయా స్థానాల్లో కూటమి తరఫున పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయనున్నట్లు సమాచారం. అయితే ఏ పార్టీకి ఎన్ని స్థానాలు కేటాయించారు? ఏయే స్థానాల్లో ఏ పార్టీ పోటీ చేయనుంది? అనే వివరాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా, ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్లు రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.. రాష్ట్రంలోని ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చిన విషయం విదితమే..

