Child Trafficking: బాలల అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది.. ఎంతో మంది ఆచూకీ దొరకడం లేదని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి.. అయితే, బాలల అక్రమ రవాణాను అరికట్టడంతో పాటు అదృశ్యమైన చిన్నారుల ఆచూకీ గుర్తించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చిన్నారుల అక్రమ రవాణా నిరోధక చర్యలను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు రాష్ట్రస్థాయిలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ కమిటీ బాలల అక్రమ రవాణా నిరోధక చర్యలను పర్యవేక్షించడంతో పాటు అదృశ్యమైన చిన్నారులకు సంబంధించిన కేసులను ఎప్పటికప్పుడు సమీక్షించనుంది.
రాష్ట్రస్థాయి కమిటీ ఏర్పాటు
బాలల అక్రమ రవాణాను అరికట్టేందుకు ఏర్పాటు చేయనున్న రాష్ట్రస్థాయి కమిటీకి మహిళా, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఛైర్పర్సన్గా వ్యవహరించనున్నారు. ఈ కమిటీలో డీజీపీతో పాటు సీఐడీ, పోలీస్ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు సభ్యులుగా ఉంటారు. అదేవిధంగా విద్యా, కార్మిక, వైద్య శాఖల ప్రతినిధులకు కూడా ఇందులో స్థానం కల్పించనున్నారు. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ప్రతినిధులను సైతం కమిటీలో భాగస్వాములను చేయనున్నారు. ఇక, రాష్ట్రస్థాయి కమిటీతో పాటు ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఈ కమిటీలు పనిచేయనున్నాయి. జిల్లా ఎస్పీ లేదా పోలీస్ కమిషనర్ కో-ఛైర్పర్సన్గా వ్యవహరిస్తారు. జిల్లాస్థాయిలో బాలల అక్రమ రవాణా నిరోధక చర్యలను పర్యవేక్షించడం, సంబంధిత శాఖల మధ్య సమన్వయం పెంచడం ఈ కమిటీల ప్రధాన బాధ్యతగా ఉంటుంది.
అదృశ్యమైన చిన్నారుల కేసులపై నిరంతర సమీక్ష
అదృశ్యమైన చిన్నారుల ఆచూకీ గుర్తించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలు చిన్నారులు కనిపించకుండా పోయిన కేసులను ఎప్పటికప్పుడు సమీక్షించనున్నాయి. కేసుల పురోగతిని పరిశీలిస్తూ చిన్నారుల ఆచూకీ గుర్తించేందుకు తీసుకోవాల్సిన చర్యలను పర్యవేక్షించనున్నాయి. మొత్తంగా బాలల అక్రమ రవాణా వంటి తీవ్రమైన సమస్యలను అరికట్టడంతో పాటు చిన్నారులకు రక్షణ కల్పించేందుకు వివిధ ప్రభుత్వ శాఖలను ఒకే వేదికపైకి తీసుకురావడం ఈ నిర్ణయం ముఖ్య ఉద్దేశం. రాష్ట్రవ్యాప్తంగా సమన్వయంతో చర్యలు చేపట్టడం ద్వారా బాలల భద్రతను మరింత బలోపేతం చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.

