AP Cabinet: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఇవాళ సమావేశం కానుంది.. ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరగనున్న కేబినెట్ సమావేశంలో 65కి పైగా కీలక అంశాలపై చర్చించనున్నారు.. క్వాంటం కంప్యూటింగ్ పాలసీ 2025–30కి ఆమోదం తెలపనుంది కేబినెట్.. ప్రతిపాదిత డ్రోన్ సిటీలో భూకేటాయింపుల విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఎస్‌ఐపీబీ ప్రతిపాదనలకు కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంది. సమావేశం అనంతరం తాజా రాజకీయ పరిణామాలపై మంత్రులతో చర్చించనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.. ఈ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టే వ్యూహంపై సూచనలు ఇవ్వనున్నారని సమాచారం. ఎమ్మెల్యేల వ్యవహారంలో మంత్రులు బాధ్యతతో వ్యవహరించాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయనున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా పలువురు ఎమ్మెల్యేల వ్యవహారంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సీరియస్ వార్నింగ్ ఇచ్చిన విషయం విదితమే..
మరోవైపు, ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగబోయే పెట్టుబడుల సదస్సు (ఇన్వెస్టర్స్ సమ్మిట్) పై కేబినెట్‌లో చర్చించనున్నారు.. ఇప్పటికే ఈ సదస్సు ఏర్పాట్ల బాధ్యతలను ముఖ్యమంత్రి మంత్రులు, అధికారులకు అప్పగించారు. రాష్ట్రానికి సుమారు రూ. లక్ష కోట్లు విలువైన పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలకు కేబనెట్ ఆమోదం తెలపనుంది.. అంతేకాకుండా పలు సంస్థలకు భూ కేటాయింపులకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇక, రాష్ట్రంలో ఇటీవల సంభవించిన ‘మొంథా’ తుఫాన్ ప్రభావం.. దాని వల్ల జరిగిన నష్టం అంచనాలు, బాధితులకు అందించాల్సిన పరిహారంపై కూడా కేబినెట్‌లో చర్చ జరగనుంది. దీంతో పాటు సీఆర్డీఏ (CRDA) పనులు కోసం NaBFID నుంచి రూ. 7,500 కోట్ల రుణం తీసుకునేందుకు అవసరమైన అనుమతిని కూడా కేబినెట్ ఇవ్వనుంది. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది..
