Botsa Satyanarayana: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అమరావతి రాజధాని అంశంపై మరోసారి చర్చనీయాంశంగా మారేలా వైసీపీ నేత బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిపై తీర్మానం చేసినంత మాత్రాన అది శాశ్వతం కాదని, అసలు నిర్మాణం పూర్తి కావడం ద్వారానే రాజధాని స్థిరపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో రైతులు, విద్యార్థులు, సామాన్య ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ, అమరావతి అంశం చుట్టూనే ప్రభుత్వం, మీడియా తిరుగుతోందని బొత్స విమర్శించారు. ప్రజల అసలు సమస్యలను పక్కన పెట్టి ఒకే అంశంపై దృష్టి సారించడం దురదృష్టకరమని అన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు లభించడం లేదని, మామిడి పండ్లలో కూడా కల్తీ జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: Iran Nuclear Plant: బిగ్ షాక్.. ఇరాన్ అణు విద్యుత్ కేంద్రం వద్ద దాడి..
అమరావతి నిర్మాణం విషయానికి వస్తే, గతంలో టీడీపీ ప్రభుత్వంలో కేవలం 5 శాతం పనులే పూర్తయ్యాయని బొత్స పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటిపోయినా పనులు ఎందుకు ముందుకు సాగడం లేదని ప్రశ్నించారు. ఇప్పటివరకు అమరావతిపై ఎంత ఖర్చు చేశారు, ఎంత ఫిజికల్‌గా పనులు జరిగాయి, ఎంత మొత్తాన్ని అడ్వాన్స్‌లుగా ఇచ్చారు అనే వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. అమరావతి నిర్మాణ వ్యయం మొదట లక్ష 16 వేల కోట్లుగా అంచనా వేయగా, ఇప్పుడు అది రెండు లక్షల కోట్లకు పెరిగిందని ఆయన చెప్పారు. నిర్మాణ వ్యయాల్లో భారీ పెరుగుదలపై కూడా స్పష్టత ఇవ్వాలని కోరారు. అలాగే అమరావతిలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, న్యాయమూర్తులు, ప్రభుత్వ ఉద్యోగుల కోసం నిర్మించిన భవనాలను పూర్తి చేసి ఎందుకు కేటాయింపులు చేయలేదని ప్రశ్నించారు.
ప్రత్యేక హోదా అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ, పార్లమెంట్‌లో అమరావతిపై చూపిన శ్రద్ధను ప్రత్యేక హోదా సాధనపై ఎందుకు చూపలేదని ప్రశ్నించారు బొత్స. ప్రత్యేక హోదా వస్తే ముంబై స్థాయి నగరాలు, అనేక అభివృద్ధి కేంద్రాలు రాష్ట్రంలో ఏర్పడే అవకాశముందని అన్నారు. అమరావతిని ఆపేయాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేసిన బొత్స, ప్రభుత్వం ముందుగా నిర్మాణ పనులను పూర్తి చేసి తరువాతే ప్రకటనలు చేయాలని సూచించారు. కేవలం పేర్లు పెట్టడం లేదా ప్రకటనలు చేయడం ద్వారా అభివృద్ధి సాధ్యం కాదని విమర్శించారు. మొత్తంగా అమరావతి అంశంలో రాజకీయ విమర్శలు ముదురుతున్న నేపథ్యంలో, బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే అవకాశముంది.
