Amaravati: రాజధాని నిర్మాణంలో మరో కీలక అడుగు.. ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌కు ఫౌండేషన్

Cbn Lvp

Cbn Lvp

Amaravati: రాజధాని అమరావతిలో మరో ప్రతిష్టాత్మక సంస్థకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. తుళ్లూరు మండలం అబ్బరాజుపాలెంలో ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు భూమి పూజ చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. అమరావతి రాజధానికి ఇలాంటి ప్రపంచస్థాయి సంస్థ రావడం గర్వకారణమన్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కోట్లాది కంటి చికిత్సలు అందించిన ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్.. అమరావతిలో మరింత విస్తృతంగా సేవలు అందించనుంది. 12 ఎకరాల విస్తీర్ణంలో.. ఏటా సుమారు 3 లక్షల మందికి చికిత్స అందించేలా సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. కంటి చికిత్సలతో పాటు.. పరిశోధన, శిక్షణ కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం అభినందనీయమన్నారు. అమరావతిలో ఏర్పాటు కానున్న ప్రత్యేక ఐ అండ్ బ్రెయిన్ సెంటర్‌ను ప్రపంచస్థాయి నేత్ర వైద్య పరిశోధనా కేంద్రంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు.

పేదలకు కంటి వైద్యం అందించడంలో ఎల్వీ ప్రసాద్ సంస్థ చేస్తున్న సేవలను సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. నాలుగు రాష్ట్రాల్లో వందలాది కేంద్రాల ద్వారా సేవలు అందిస్తున్న సంస్థ.. డిజిటల్ హెల్త్ ఐ ప్రొఫైల్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తోందన్నారు. అమరావతిని కేవలం పరిపాలనా రాజధానిగా కాకుండా.. నాలెడ్జ్ ఎకానమీ, పరిశోధన, ఆరోగ్యం, మానవ అభివృద్ధికి కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని చంద్రబాబు తెలిపారు. నోపోల్ సిటీ.. బ్లూ అండ్ గ్రీన్ సిటీ.. గ్రీన్ ఎనర్జీ.. కార్బన్ న్యూట్రల్ సిటీ.. డీప్‌టెక్ క్యాపిటల్‌గా అమరావతిని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నామని చెప్పారు.

ఇక టెక్నాలజీ రంగంలోనూ అమరావతికి ప్రత్యేక స్థానం కల్పించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. క్వాంటం కంప్యూటింగ్ కేంద్రం, ఏఐ, ల్యాబొరేటరీ ఆటోమేషన్, ఎక్స్‌పెరిమెంటల్ బయాలజీ, క్వాంటం బయో వ్యాలీ వంటి రంగాల్లో పెట్టుబడులు, సంస్థలను ఆకర్షిస్తున్నామని తెలిపారు. ఐబీఎం, టీసీఎస్, ఎల్‌ అండ్‌ టీ సంస్థల భాగస్వామ్యంతో 133 క్యూబిట్ సామర్థ్యం ఉన్న క్వాంటం కంప్యూటర్ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చెప్పారు. ఇప్పటికే పలు క్వాంటం స్టార్టప్‌లు అమరావతిలో ఏర్పాటుకు ముందుకు వచ్చాయని తెలిపారు. స్పేస్, డ్రోన్లు, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ క్లస్టర్లతో భవిష్యత్ టెక్నాలజీ పరిశ్రమలకు అమరావతిని కేంద్రంగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు అన్నారు.

వైద్య, విద్యా రంగాల్లోనూ ప్రతిష్టాత్మక సంస్థలు అమరావతికి వస్తున్నాయని చెప్పారు చంద్రబాబు… వెట్, ఎస్ఆర్ఎం, అమృతానందమయి సంస్థలతో పాటు బిట్స్ పిలానీ, ఎక్స్ఎల్ఆర్ఐ వంటి సంస్థలు కూడా రానున్నాయని వెల్లడించారు. సుమారు రూ.50 వేల కోట్ల విలువైన పనులు అమరావతిలో కొనసాగుతున్నాయని సీఎం తెలిపారు. ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు, స్పోర్ట్స్ సిటీ, అంతర్జాతీయ విమానాశ్రయం వంటి ప్రాజెక్టులు కూడా రానున్నాయని చెప్పారు. అమరావతిలో హెల్త్‌కేర్ ఎకోసిస్టమ్‌లో భాగంగా బసవతారకం క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌తో పాటు ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ వంటి సంస్థలు వస్తున్నాయని తెలిపారు. బ్యాంకింగ్ స్ట్రీట్‌తో ఆర్థిక కార్యకలాపాలకు కూడా కేంద్రంగా అమరావతి మారుతుందని చెప్పారు. ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ ప్రపంచస్థాయి కంటి వైద్యం, పరిశోధన, శిక్షణకు కేంద్రంగా ఎదగాలని ఆకాంక్షించారు. సాంకేతికత, అవకాశాలను యువత అందిపుచ్చుకుని ఆకాశమే హద్దుగా ఎదగాలని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..