NTV Telugu Site icon

MLC Elections 2025: ఏపీలో రేపే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్.. పగడ్బందీగా ఏర్పాట్లు..

Mlc Elections 2025

Mlc Elections 2025

MLC Elections 2025: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల మోడ్‌లోకి వెళ్లింది. ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల ఉపాధ్యాయ నియోజ‌క‌వ‌ర్గం, ఉమ్మడి ఉభ‌య గోదావ‌రి జిల్లాల ప‌ట్టభ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గం, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల ప‌ట్టభ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గ స్థానాల‌కు… రేపు ఎన్నిక‌లు జ‌రగనున్నాయి. ఈ జిల్లాల ప‌రిధిలోని ఉద్యోగుల‌కు ఎన్నిక‌ల సంఘం క్యాజువ‌ల్ లీవ్‌ను ప్రక‌టించింది. దీంతో ఉద్యోగ‌, ఉపాధ్యాయులు తమ ఓటు హ‌క్కును వినియోగించుకునేందుకు అవ‌కాశం క‌ల్పించింది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ది మంది అభ్యర్థులు బ‌రిలో ఉన్నారు. 123 పోలింగ్ స్టేష‌న్లలో పోలింగ్ జ‌ర‌గ‌నుంది. 22,493 మంది ఓట‌ర్లు ఉన్నారు. 13,503 మంది పురుషులు, 8,985 మంది మ‌హిళ‌లు ఉన్నారు. శ్రీకాకుళం, విజ‌య‌న‌గరం, విశాఖ‌ప‌ట్నం జిల్లాల ప‌రిధిలో ఎన్నిక జ‌రుగుతోంది. యుటీఎఫ్‌ నుంచి కోరెడ్ల విజ‌య‌గౌరి, ఏపీటీఎఫ్‌ తరపున పాక‌ల‌పాటి ర‌ఘువ‌ర్మ, పీఆర్‌టీయూ నుంచి గాదె శ్రీ‌నివాసుల‌నాయుడు పోటీ చేస్తున్నారు.

Read Also: Vallabhaneni Vamsi Cases: వల్లభనేని వంశీపై మరో ఫిర్యాదు

ఇక, ఉమ్మడి ఉభ‌య గోదావ‌రి జిల్లాల ప‌ట్టభ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గం నుంచి 34 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థి పేరాబ‌త్తుల రాజ‌శేఖ‌ర్‌, పీడీఎఫ్ అభ్యర్థి డీవీ రాఘ‌వులు మ‌ధ్యనే ప్రధానంగా పోటీ ఉంటుంది. మొత్తం 3,14,984 ఓట్లు ఉంటే.. 1,83,347 మంది పురుషులు, 1,31,618 మంది మ‌హిళ‌లు ఉన్నారు. 19 మంది ట్రాన్స్ జండ‌ర్స్ కూడా ఉన్నారు. మొత్తం 456 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మరోవైపు.. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల ప‌ట్టభ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గంలో 30 మంది అభ్యర్థులు బ‌రిలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థి ఆల‌పాటి రాజేంద్రప్రసాద్, పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ ల‌క్ష్మణ‌రావు మ‌ధ్య ప్రధానంగా పోటీ ఉంటుంది. మొత్తం 3,46,529 ఓట్లు ఉన్నాయి. మొత్తం 416 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Read Also: Vallabhaneni Vamsi Cases: వల్లభనేని వంశీపై మరో ఫిర్యాదు

మరోవైపు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పగడ్బందీగా జరుగుతున్నాయి.. విశాఖలోని ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ నుండి పోలింగ్ మెటీరియల్ పంపిణీ మరి కాసేపట్లో జరగనుంది.. ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లా, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా, శ్రీకాకుళం జిల్లా మొత్తం ఆరు జిల్లాలకు మెటీరియల్ పంపిణీకి ప్రత్యేక బస్సులు సిద్ధం చేశారు.. ఎమ్మెల్సీ ఎన్నికను నిర్వహించేందుకు యంత్రాంగం పూర్తి సన్నద్ధంగా ఉందని ఆ దిశగా పట్టిష్ట ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల అధికారి తెలిపారు.. ఉత్తరాంధ్ర పరిధిలో ఉన్న ఆరు జిల్లాల్లో మొత్తం 22,493 మంది ఓటర్లు ఉన్నారు.. మూడు జిల్లాల పరిధిలో 123 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు… ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు… అత్యధికంగా విశాఖలో ఓటర్లు 5529 ఉండగా అత్యలపంగా అల్లూరు జిల్లాలో 1488 మంది ఓటర్లు ఉన్నారు..