Cyclone Akvan: దూసుకొస్తున్న అక్వాన్ తుఫాన్‌.. తీరం దాటేది ఇక్కడే..! అత్యంత భారీ వర్షాలు..

Cyclone Akvan

Cyclone Akvan

Cyclone Akvan: బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుఫాన్‌ ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం వైపు దూసుకొస్తోంది. ప్రస్తుతం ఈ తుఫాన్‌ నెమ్మదిగా కదులుతున్నప్పటికీ, క్రమంగా బలపడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. గత ఆరు గంటల్లో గంటకు కేవలం 3 కిలోమీటర్ల వేగంతో కదిలినట్లు తెలిపింది. బుధవారం ఉదయానికి తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉందని అంచనా వేసింది. ప్రస్తుతం అక్వాన్ తుఫాన్‌ చెన్నైకి 590 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 620 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 620 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 750 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా ప్రయాణిస్తూ గురువారం సాయంత్రానికి అతి తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

ఇక, శుక్రవారం మధ్యాహ్నానికి నెల్లూరు – విశాఖపట్నం మధ్య తుఫాన్‌ తీరం దాటే అవకాశముంది. తీరం దాటే సమయంలో గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉండగా, గరిష్ఠంగా గంటకు 145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. తుఫాన్‌ ప్రభావంతో గురువారం, శుక్రవారం కోస్తా ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. రైతులు వ్యవసాయ పనుల విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, పంటలు, వ్యవసాయ ఉత్పత్తుల రక్షణకు అవసరమైన చర్యలు చేపట్టాలని కోరింది.

విద్యుత్ శాఖ కంట్రోల్ రూమ్ నంబర్లు విడుదల
మరోవైపు అక్వాన్ తుఫాన్‌ నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే వెంటనే స్పందించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ నంబర్లను ఏర్పాటు చేసింది. అత్యవసర విద్యుత్ సేవల కోసం ప్రజలు టోల్ ఫ్రీ నంబర్ 1912కు ఫోన్ చేయవచ్చని అధికారులు తెలిపారు.

జిల్లాల వారీగా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే:
* కృష్ణా జిల్లా: 6281709355
* ఎన్టీఆర్ జిల్లా: 9440817561
* గుంటూరు: 9440817526
* బాపట్ల: 9281413774
* ప్రకాశం: 9440817491
* పల్నాడు: 7382623148
* మార్కాపురం: 7780420711
* APCRDA: 8331092947

తుఫాన్‌ సమయంలో విద్యుత్ స్తంభాలు, తెగిపడిన విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని, ఎలాంటి విద్యుత్ సమస్యలు ఎదురైనా స్వయంగా మరమ్మతులు చేయకుండా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ప్రజలు అధికారుల సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.