ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా శనివారం నాడు విశాఖ జిల్లాలో పర్యటించారు. ఈ రోజు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా విశాఖలోని ఆర్కే బీచ్‌లో అల్లూరి విగ్రహానికి పూలమలలు వేసి ఆమె నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. అనంతరం మంత్రి రోజా మాట్లాడుతూ.. అల్లూరి కేవలం 27 ఏళ్లే జీవించినా 27 తరాలు గుర్తుంచుకునేలా జీవించారని వ్యాఖ్యానించారు. అల్లూరి పేరు చెప్తేనే చాలా మంది రోమాలు నిక్కబొడుచుకుంటాయని తెలిపారు. అల్లూరి మరణించి వందేళ్లు అయినా ఆయనకు మరణం లేదనే విషయాన్ని అందరూ భావిస్తున్నారని పేర్కొన్నారు. అల్లూరి స్మారకార్థం లంబసింగిలో రూ.35 కోట్లతో కేంద్రం సహకారంతో అల్లూరి మ్యూజియం ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి రోజా వెల్లడించారు.
అటు తొట్లకొండలో రాష్ట్ర ఆర్కియాలజీ శాఖ పరిరక్షిస్తున్న ప్రాచీన బౌద్ధ మహా స్థూపాన్ని మంత్రి రోజా సందర్శించారు. అనంతరం రోజా మాట్లాడారు. ఏపీ పురావస్తు శాఖ ఆధీనంలో ఈ ప్రాచీన బౌద్ధ నిర్మాణాలు పరిరక్షింపబడుతున్నాయని తెలిపారు. రెండు వేల ఏళ్ల నాటి బౌద్ధ నాగరిక ప్రపంచంలోకి తీసుకువెళ్లే ఓ అద్భుతమైన ప్రదేశం విశాఖ నగర శివార్లలో ఉండటం, మన రాష్ట్ర పర్యాటక ప్రదేశాలలో ప్రాచీన బౌద్ధ క్షేత్రం తొట్లకొండ ముఖ్యమైనదిగా చెప్పోకోవచ్చని అన్నారు. ఏపీలో బౌద్ధ మత వైభవానికి ఈ ప్రాంతం అద్దం పడుతుందన్నారు. మహా స్థూపం తరువాత ప్రముఖంగా బౌద్ధ భిక్షువుల నీటి అవసరాల కోసం అప్పట్లో ఇక్కడ 11 నీటి తొట్టెలను నిర్మించినట్లు చరిత్ర ఉందని.. ఇక్కడకు వచ్చిన టూరిస్టులు కొన్ని వేల ఏళ్లు వెనక్కి వెళ్లిన అనుభూతిని చెందుతారని చెప్పడంలో సందేహం లేదన్నారు. ఈ మేరకు పర్యాటకులకు మౌలిక వసతులు కల్పించాలని అధికారులను మంత్రి రోజా ఆదేశించారు.