Maredumilli: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి లోతట్టు అటవీ ప్రాంతాలకు పర్యాటకులు వెళ్లోద్దని పోలీసుల హెచ్చరికలు జారీ చేశారు. గత నెలలో జరిగిన ఎన్ కౌంటర్లు నేపథ్యంలో మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ కూంబింగ్ లో మావోయిస్టులు ఇంతకు ముందే మారేడుమిల్లి లోతట్టు ప్రాంతాల్లో కొన్ని ల్యాండ్ మైన్లు, ప్రెజర్ మైన్లు అమర్చినట్లు గుర్తించాయి. భద్రతా దళాలను హత మార్చేందుకు వీటిని అమర్చారని కూంబింగ్ లో పోలీసులు కనుగొన్నారు. దీంతో కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రత దళాలు ఈ మందు పాత్రలను వెలికి తీసే పనులు ప్రారంభించారు. మందు పాత్రలను వెలికి తీసే వరకు అటవీ ప్రాంతాల్లోకి ప్రజలు, పర్యాటకులు వెళ్లొద్దని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.
Read Also: ఆయుర్వేదంలో ఆపరేషన్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. వ్యతిరేకిస్తున్న అల్లోపతి వైద్యులు
అయితే, మారేడుమిల్లి అటవీ ప్రాంత పరిధిలో గత నెల 18, 19 తేదీల్లో మావోయిస్టులు- పోలీసులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత.. హిడ్మాతో పాటు మొత్తం 13 మంది మృతి చెందారు. అలాగే, ఈ నెల 25వ తేదీన ఒడిశాలోని కంధమాల్ జిల్లా అడవుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్ట్ అగ్రనేత గణేష్ ఉయికేతో సహా ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఘటనతో సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భద్రతా దళాలు మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భారీగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే భద్రత దళాలు కొన్ని ల్యాండ్ మైన్స్, ప్రెజర్ మైన్స్ ను స్వాధీనం చేసుకున్నాయి. ఇందులో భాగంగా మారేడుమిల్లి లోతట్టు ప్రాంతాలను జల్లెడ పట్టి, మందు పాత్రలను వెలికి తీసే చర్యలను పోలీసులు కొనసాగిస్తున్నారు.