అగ్నిపథ్ ఆందోళనలకు మరో ప్రాణం బలైంది. రైలులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. సకాలంలో వైద్యం అందక పోవడంతో అతను తుదిశ్వాస విడిచాడు. చికిత్స కోసం విశాఖకు వస్తుండగా అగ్నిపథ్ ఆందోళనల కారణంగా రైలు నిలిపివేయడంతో తీవ్ర అస్వస్థతతో మరణించాడు. ఈ ఘటన ఏపీలో జరిగింది. కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్ కొత్తవలసలో నిలిపివేశారు. చికిత్స కోసం ఒడిశా నుంచి వచ్చిన జోగేష్ బెహరా(70) మృతిచెందాడు. అగ్నిపథ్ అల్లర్లతో విశాఖ వెళ్లాల్సిన రైలు కొత్తవలసలో నిలిపివేశారు. సమయానికి అంబులెన్స్ లేక కొత్తవలసలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స చేస్తుండగానే మృతిచెందాడు జోగేష్ బెహరా. దీంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు మృతుని కుటుంబసభ్యులు.
విజయనగరం జిల్లా కొత్తవలస లో అగ్నిపథ్ ఆందోళనల నేపథ్యంలో కోర్బా నుంచి విశాఖపట్నం వెళ్లాల్సిన ఎక్స్ ప్రెస్ రైలు కొత్తవలసలో నిలిపివేయడంతో ఒడిశా రాష్ట్రంలో కలహండి జిల్లా నౌహుపాడకు చెందిన గుండెజబ్బు వ్యక్తి జోగేష్ బెహరా(70)మరణించాడు. చికిత్స కోసం నౌహుపాడ నుంచి విశాఖకు కోర్బా రైల్లో కుటుంబ సభ్యులతో ప్రయణిస్తున్న జోగేష్ బెహరాకు విజయనగరం దాటిన సమయంలో ఒక్కసారిగా గుండె నొప్పి అధికమయ్యింది. కాసేపట్లో విశాఖకు చేరుకోవాల్సిన కోర్బా రైలుని అర్ధాంతరంగా కొత్తవలస రైల్వేస్టేషన్ లో నిలిపివేశారు. అప్పటికే అస్వస్థతకు గురైన జోగేష్ బెహరాను కుటుంబ సబ్యులు సమయానికి ఆసుపత్రికి తీసుకెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. సమయానికి అంబులెన్స్ సైతం అందుబాటులో లేకపోవటంతో కొత్తవలసలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స చేస్తుండగానే జోగేష్ బెహరా మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు. కళ్ళముందే తమ ఇంటి పెద్దదిక్కుని కోల్పోయిన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
