NTV Telugu Site icon

Ali: వచ్చే ఎన్నికల్లో పోటీ.. మరోసారి ఆలీ ఆసక్తికర వ్యాఖ్యలు

Ali

Ali

Ali: రానున్న అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. 175కి 175 స్థానాల్లో విజయమే టార్గెట్‌గా పెట్టుకున్నారు.. కొన్ని చోట్ల సిట్టింగ్‌లకు షాక్‌ తప్పదనే ప్రచారం కూడా సాగుతోంది.. దీంతో.. ఈసారి మాకు అవకాశం వస్తుందని ఎదురుచూసేవాళ్లు లేకపోలేదు.. అయితే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సినీ నటుడు ఆలీ.. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్ లో ఆర్‌పీఎల్‌ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు ఆలీ.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏడు రాష్ట్రాల నుండి టీమ్స్ ను తీసుకువచ్చి రాజమండ్రిలో ఆర్‌పీఎల్‌ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో కొన్ని వందల సినిమాలు షూటింగ్ జరిగాయని గుర్తుచేశారు. ఇక, ఇదే సమయంలో రాజకీయాల గురించి మాట్లాడుతూ.. మా నాయకుడు ఎక్కడ నుంచి ఆదేశిస్తే అక్కడ నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు.. ఎక్కడ పోటీ చేస్తాం అనే దానిపై పుకార్లు అనేవి సాధారణంగా జరుగుతూ ఉంటాయని వ్యాఖ్యానించారు ఆలీ.

Read Also: Lata Mangeshkar: ఈ లెజెండ్ మొదటి సంపాదన 101/-

కాగా, ఈ మధ్యే ఎలక్ట్రానిక్ మీడియా ప్రభుత్వ సలహాదారుగా ఆలీని నియమించారు సీఎం వైఎస్‌ జగన్‌.. గతంలోనో ఎన్నికల్లో పోటీపై హాట్‌ కామెంట్లు చేశారు.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని జోస్యం చెప్పారు. పార్టీ ఆదేశిస్తే జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పై పోటీ చేసేందుకు కూడా సిద్ధమంటూ తిరుపతిలో వ్యాఖ్యానించిన విషయం విదితమే. ఎక్కడి నుంచైనా పోటీకి తాను రెడీ అన్నారు. పవన్‌ కల్యాణ్‌ తనకు మంచి స్నేహితుడని, అయితే సినిమాలు వేరు, రాజకీయాలు వేరని ఆలీ చెప్పుకొచ్చిన విషయం విదితమే.. మొత్తంగా ఆలీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. పార్టీ ఆదేశిస్తే.. ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్ధమని ప్రకటించారు. దీంతో, ఆలీ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. అది కూడా పలానా నియోజకవర్గం అంటూ ప్రచారం జోరుగా సాగుతోన్న విషయం విదితమే.