Site icon NTV Telugu

AB Venkateswara Rao: నా సస్పెన్షన్‌పై న్యాయపోరాటం చేస్తా

Ab Venkateswara Rao

Ab Venkateswara Rao

తనపై ఏపీ ప్రభుత్వం మరోసారి సస్పెన్షన్ విధించడాన్ని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాక్షులను ప్రభావితం చేస్తున్నారనే అభియోగంపై సస్పెండ్ చేస్తున్నట్టు జీవో ఇచ్చారని..ఛార్జీ షీట్ లేదు.. ట్రయల్ లేదు.. అయినా తాను సాక్షులను ప్రభావితం చేయడమేంటని ప్రశ్నించారు. ఏమీ లేని దానికి తనను సస్పెండ్ చేస్తూ జీవో ఇచ్చారని.. తనను మళ్లీ సస్పెండ్ చేయాలనే సలహా ఏ తీసేసిన తహసీల్దార్ ఇచ్చారో..? ఏ పనికి మాలిన సలహాదారు ఇచ్చారో తెలియదన్నారు. తనను సస్పెండ్ చేస్తూ జారీ చేసిన జీవో లీగల్‌గా చెల్లుబాటు కాదని స్పష్టం చేశారు. సీఎం జగన్ మీద ఛార్జీ షీట్లు ఉన్నాయని.. కేసులు ఉన్నాయని.. అయినా సీఎంగా కొనసాగుతున్నారుగా అంటూ ప్రశ్నించారు.

Read Also: రచ్చకెక్కుతున్న వైసీపీ సీనియర్లు..! సొంత పార్టీ నేతలపైనే తీవ్ర ఆరోపణలు

కేసులు ఎదుర్కొన్న ఐఏఎస్ శ్రీలక్ష్మీ పదవిలో కొనసాగుతున్నారని.. పదవిలో కొనసాగేందుకు ఆమెకు లేని అభ్యంతరం తనకే ఎందుకు అని ఏబీ వెంకటేశ్వరరావు నిలదీశారు. అసలు డబ్బులు ట్రాన్సక్షన్ జరగని కేసులో అవినీతి ఏంటని ప్రశ్నించారు. కొందరు ఆఫీసర్లు చేసే పనుల వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని.. తనను ప్రభుత్వం టార్గెట్ చేయడం లేదని.. కొందరు వ్యక్తులు.. కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. తాను ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్నప్పుడు రాష్ట్రాన్ని తగులబెట్టకుండా ఆపానని.. కోడి కత్తి దాడి సమయంలో గంటల్లోనే రాష్ట్రాన్ని తగులపెట్టాలని టార్గెటుగా పెట్టుకున్నారని.. తాను దాన్ని అడ్డుకున్నానని వివరించారు. అప్పట్లో రాష్ట్రం నాశనం కాకుండా తాను అడ్డుకోవడం ఇష్టం లేని వారు ఇప్పుడు తనను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ మారిన 23 మంది ఎమ్మెల్యేల్లో 22 మంది ఎమ్మెల్యేలు బతికే ఉన్నారని.. పార్టీని మారమని తానేమైనా ప్రేరేపించానేమోననే విషయాన్ని వారిని అడగొచ్చుగా అంటూ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని కూలగొడతామని రాజ్ భవన్ గేట్ దగ్గర తానేమన్నా మాట్లాడానా అంటూ నిలదీశారు. తనపై విధించిన సస్పెన్షన్‌పై న్యాయపోరాటం చేస్తానని.. ఐపీఎస్ సంఘం ఎందుకు స్పందించడం లేదో వాళ్లనే అడగాలన్నారు. సమాజంలో ఉన్న పురుగులను ఏరివేసే వ్యవసాయం చేస్తూనే ఉన్నానని.. దుర్మార్గుడైన రాజు పాలనలో పని చేసే దాని కన్నా.. వ్యవసాయం చేసుకోవడం మేలని బమ్మెర పోతన చెప్పాడని ఏబీ వెంకటేశ్వరరావు గుర్తుచేశారు.

Exit mobile version