YSRCP: వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్ప యాత్ర ముగిసి ఇవాళ్టికి నాలుగేళ్లు పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఇతర నేతలు కట్ చేశారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్సీలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, లేళ్ల అప్పిరెడ్డి, ఎంపీ నందిగం సురేష్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. జగన్ పాదయాత్రకు టైమ్ బాండ్ పెట్టుకోలేదని.. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు ఆయన పాదయాత్ర చేశారని తెలిపారు. సుదీర్ఘ పాదయాత్ర చేసిన తర్వాత కేవలం రెండు పేజీలతోనే మేనిఫెస్టో సిద్ధం చేశారన్నారు. నాయకుడు అంటే ఇచ్చిన మాటను ఎంత వరకు పూర్తి చేశాడు అనే విషయాన్ని ప్రజలు కూడా గమనిస్తారని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. జగన్ మ్యానిఫెస్టోలో హామీలను 98 శాతం పూర్తి చేశారన్నారు. మ్యానిఫెస్టోలో 98 శాతం పూర్తి చేసిన నాయకుడు చరిత్రలో లేడని.. అధికారంలోకి వచ్చిన మూడో రోజే మ్యానిఫెస్టోను మాయం చేసిన పార్టీలు ఉన్నాయని టీడీపీని ఉద్దేశించి ఉమ్మారెడ్డి ఆరోపించారు.
అటు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ప్రజా జీవితం అంటే నిత్యం ప్రజల్లో ఉండటం అని నమ్మిన వ్యక్తి జగన్ అని అన్నారు. ఆయన తన తండ్రి వైఎస్ఆర్ నుంచి ప్రజా సేవను వారసత్వంగా తీసుకున్నారని.. ఇచ్చిన హామీల్లో 98 శాతం పూర్తి చేయటం అసాధారణ విషయం అన్నారు. జన్మభూమి కమిటీల పేరుతో గత ప్రభుత్వంలో అడ్డంగా దోచుకున్నారని సజ్జల ఆరోపించారు. జగన్ ప్రభుత్వంలో పారదర్శకంగా సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందుతున్నాయని.. గత ఎన్నికల్లో జగన్ సింగిల్ హ్యాండ్‌తో బరిలో నిలబడి ఘనవిజయం సాధించారని సజ్జల గుర్తుచేశారు. 151 స్థానాలు ఆషామాషీగా రాలేదని.. గత ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబును వదిలించుకోవాలనే స్థితిలో ఉన్నారని తెలిపారు.
