అమరావతి: తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ను 1998 డీఎస్సీ అభ్యర్థులు కలిశారు. ఈ సందర్భంగా తమ పాతికేళ్ల కలను నెరవేర్చినందుకు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇటీవల 1998 డీఎస్సీలో పలు కారణాల వల్ల ఉద్యోగాలు పొందలేకపోయిన వారికి పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం సీఎం జగన్ పోస్టింగులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో 24 ఏళ్ళ నాటి సమస్యను పరిష్కరించడం ద్వారా తమను, తమ కుటుంబాలను ఆదుకున్నారని ముఖ్యమంత్రి జగన్ వద్ద 1998 డీఎస్సీ అభ్యర్థులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా సీఎం జగన్‌ను సన్మానించారు. ముఖ్యమంత్రి జగన్‌ను కలిసిన వారిలో 1998 డీఎస్సీ అభ్యర్థులతో పాటు ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి కూడా ఉన్నారు.
కాగా ఉద్యోగం పొందిన 1998 డీఎస్సీ అభ్యర్థుల జాబితాలో వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కూడా ఉన్నారు. 23 ఏళ్ల తర్వాత ఆయన కూడా ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. బీఏ సోషల్, ఇంగ్లీష్ పోస్టుకు కరణం ధర్మశ్రీ 1998లో డీఎస్సీ రాశారు. కోర్టు వివాదాల కారణంగా 1998 డీఎస్సీ అభ్యర్థులకు అప్పట్లో ఉద్యోగాలు ఇవ్వలేదు. అనంతరం అనివార్య కారణాల వల్ల కరణం ధర్మశ్రీ రాజకీయాల్లోకి వచ్చారు. గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన విభాగంలో ఆయన పనిచేశారు. మాడుగుల ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ తరపున తొలిసారి 2004 ఎన్నికల్లో విజయం సాధించారు.
Karamam Dharmasri: టీచర్ ఉద్యోగం సంపాదించిన వైసీపీ ఎమ్మెల్యే