Andhra Pradesh: మాములుగా పండగల సందర్భంగా గోదావరి ప్రాంత ప్రజలు తమ అల్లుళ్లకు చేసే రాచ మర్యాదలే వేరు. గోదావరోళ్ల మర్యాదల గురించి ఇప్పటికే చాలాసార్లు విన్నాం. సంక్రాంతి, దసరా వంటి పండగలకు తమ ఇంటికి వచ్చే కొత్త అల్లుడికి అదిరిపోయే రీతిలో అత్తింటి వారు విందులను ఏర్పాటు చేస్తుంటారు. ఆ విందులోని ఐటమ్స్ చూస్తే మనకు కూడా నోట్లో నోరూరుతుంది. అయితే తాజాగా విశాఖకు చెందిన ఓ కుటుంబం తమకు కాబోయే అల్లుడికి 125 రకాలతో విందు ఏర్పాటు చేసి వడ్డించడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే చర్చనీయాంశంగా మారింది.
Read Also: Nobel Peace Prize : ఈ ఏడాది నోబుల్ శాంతి బహుమతి ఎవరికి దక్కిందంటే..?
వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం జిల్లా ఎస్.కోటకు చెందిన కాపుగంటి రామకృష్ణ, సుబ్బలక్ష్మీ దంపతుల కుమారుడు చైతన్యకు విశాఖకు చెందిన కలగర్ల శ్రీనివాసరావు, ధనలక్ష్మి దంపతుల కుమార్తె నిహారికతో ఇరుకుటుంబాల పెద్దలు ఇటీవల వివాహం ఖాయం చేశారు. ఈ జంటకు వచ్చే ఏడాది మార్చి 9న వివాహం జరగనుంది. అయితే చైతన్య-నిహారిక నిశ్చితార్థం పూర్తయ్యాక దసరా తొలి పండగ కావడంతో కాబోయే అల్లుడిని అత్తింటి వారు ప్రత్యేకంగా ఆహ్వానించి జన్మజన్మలకు గుర్తుండిపోయేలా విందు ఏర్పాటు చేశారు. 95 రకాల వంటకాలను ఇంట్లోనే తయారు చేయగా.. మిగతా 30 రకాల వంటకాలను బయట ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి తెప్పించారు. ఇన్ని వంటకాలను చూసిన అల్లుడు ఆశ్చర్యపోయాడు. వాటిలో కొన్ని వంటకాలను తన లైఫ్‌లో తొలిసారి చూస్తున్నట్లు చైతన్య తెలిపాడు. కాగా ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.