Site icon NTV Telugu

Congress Party: పీకే వ్యూహాలతో గుజరాత్ పై కాంగ్రెస్ నజర్

గుజరాత్‌పై కాంగ్రెస్‌ పార్టీ గురి పెట్టిందా? అక్కడ జరిగే ఎన్నికల్లో గెలుపొందేందుకే ప్రశాంత్‌ కిశోర్‌ వ్యూహాలతో కాంగ్రెస్‌ ముందుకు వెళ్లనుందా? అందుకే రాహుల్‌తో రాజకీయ వ్యూహకర్త పీకే భేటీ అయ్యారా? ఇప్పుడంతా ఇదే టాపిక్ అవుతోంది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌… కాంగ్రెస్‌ పార్టీ కోసం రంగంలోకి దిగుతున్నారా? మోదీ ఇలాఖా గుజరాత్‌లో బీజేపీని గద్దె దించి… గాంధీల పార్టీని గెలిపిస్తారా? దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు పునరుజ్జీవం తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారా? పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారా? అందుకే రాహుల్‌ గాంధీతో ప్రశాంత్‌ కిశోర్‌ భేటీ అయ్యారా? ఇప్పుడిదే జాతీయ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రశాంత్‌ కిశోర్‌ రంగంలోకి దిగనున్నారనే చర్చ జోరుగా జరుగుతోంది.

ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్‌ పార్టీ పోస్టుమార్టం మొదలుపెట్టింది. అధికారంలో ఉన్న పంజాబ్‌ను సైతం చేజార్చుకున్న కాంగ్రెస్‌.. మిగతా నాలుగు రాష్ట్రాల్లో పోటీలోనే లేనట్టుగా కనిపించింది. అలాగే దేశవ్యాప్తంగా పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఈ ప్రమాదాన్ని నివారించేందుకు, పార్టీని కాపాడుకునేందుకు రాజకీయ వ్యూహకర్తలు కావాలని కాంగీయులు భావిస్తున్నారు. అందుకే ప్రశాంత్‌ కిషోర్‌ (Prashant Kishor) ను రంగంలోకి దించేందుకు కాంగ్రెస్‌ పెద్దలు ప్రయత్నిస్తున్నారని సమాచారం. అలాగే గుజరాత్‌లో కమలం పార్టీని ఓడించడానికి పీకే సేవలను తీసుకునే ఆలోచనలో కాంగ్రెస్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రాహుల్‌, ప్రియాంక గాంధీలతో పీకే చర్చలు జరిపారని సమాచారం.

నిజానికి గుజరాత్‌లో కాంగ్రెస్‌ పార్టీకి అధికారం… దశాబ్దాలుగా అందని ద్రాక్ష అన్న చందంగా మారింది. ఈ ఏడాది చివర్లో జరిగే ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని కాంగ్రెస్‌ అధిష్టానం భావిస్తోంది. అలాగే పార్టీకి దేశవ్యాప్తంగా పునరుత్తేజం తేవాలంటే.. మోదీ ఇలాఖాలో కాంగ్రెస్‌ జెండాను రెపరెపలాడించడమే సరైందని కాంగీయులు లెక్కలు కడుతున్నారు. ఇందులో భాగంగానే గుజరాత్‌పై హస్తం పార్టీ ఎక్కువగా దృష్టి కేంద్రీకరించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‌తో పీకే కలయిక వర్కవుట్‌ అవుతుందా? అని అంతా చర్చించుకుంటున్నారు.

గుజరాత్‌లో గెలవడం అనేది కాంగ్రెస్‌ (Congress party)కు అంత సులువైన పని కాదు. అందుకే ఇక్కడ పీకే రాజకీయ వ్యూహాలతో ముందుకు వెళ్లాలని కాంగ్రెస్‌ హైకమాండ్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల కాంగ్రెస్‌పై విమర్శలు, రాహుల్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించిన పీకే.. ఇప్పుడు వారితోనే కలిసి పనిచేయాలనే ఆలోచనలో ఉండటం ఎంతవరకు వర్కవుట్‌ అవుతుందో అనేది రాజకీయవర్గాల్లో ఆసక్తిగా మారింది.

https://ntvtelugu.com/rahul-gandhi-appreciates-india-women-cricketers/
Exit mobile version