Site icon NTV Telugu

NTV Specials : మే 9 వైపు చూస్తోన్న ప్రపంచం.. పుతిన్‌ ఏం చేయబోతున్నాడు.!

సోమవారం రష్యాలో “విజయ దినం కవాతు” జరగనుంది. “విక్టరీ డే పరేడ్‌”గా ప్రసిద్ధి గాంచిన ఈ మెగా ఈవెంట్‌ కు పుతిన్‌ సర్కార్‌ ఘనంగా ఏర్పాట్లు చేసింది. వేలాదిగా సైనికులు, వందల సంఖ్యలో యుద్ధ ట్యాంకులు, భారీ సైనిక వాహనాలు రాజధాని మాస్కో నడిబొడ్డున రెడ్ స్క్వేర్ గుండా ప్రదర్శనగా సాగిపోనున్నాయి. ఆకాశంలో ఫైటర్ జెట్లు గర్జిస్తుండగా రష్యా తన సైనిక పాటవాన్ని ప్రపంచానికి ప్రదర్శించనుంది.

రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై సోవియట్ యూనియన్ విజయానికి గుర్తుగా ప్రతి ఏటా మే9న విక్టరీ డే సంబరాలను ఘనంగా నిర్వహిస్తారు. ఐతే, సోమవారం జరిగే 77వ వార్షికోత్సవం యావత్‌ ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. ఉక్రెయిన్‌పై దండయాత్ర కొనసాగుతున్న ప్రస్తుత సమయంలో ఈ సెలబ్రేషన్స్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. యావత్‌ ప్రపంచం రష్యా వైపు ఆసక్తిగా చూస్తోంది. ఈ ఏడాది విక్టరీ డే వేడుకలను యుద్ధంలో రష్యా దూకుడును మరింత పెంచేందుకు ఉపయోగించుకోవచ్చని కొన్ని దేశాలు భయపడుతున్నాయి.

రెండవ ప్రపంచ యుద్ధ విజయం…యుద్ధానంతర సోవియట్ చరిత్రలో గొప్ప మలుపు. యుద్ధం తరువాతే అది అగ్రరాజ్యంగా అవతరించింది. ఆ విజయం అక్టోబర్‌ విప్లవాన్ని మరిపించింది. నాజీలపై గెలుపు అంత సులభంగా దక్కలేదు. లక్షలాది మంది సైనికులు, కోట్లాది మంది పౌరుల బలిదానంతో దక్కిన విజయం అది. అందుకే రష్యన్లు ఆ విజయానికి అంత ప్రాధాన్యం ఇస్తారు.

రెండవ ప్రపంచ యుద్ధం రష్యాకు అత్యంత ఖరీదైన యుద్ధం. రెండు కోడ్ల డెబ్బయ్‌ లక్షల మంది పౌరులను బలిపెట్టి గెలిచిన యుద్ధం. అందుకే జర్మనీపై సోవియట్‌ విజయం రెండవ ప్రపంచ యుద్దంలోనే అతి పెద్ద విజయం. అంతటి ప్రాధాన్యత కలిగిన ఈ రోజును ప్రెసిడెంట్‌ పుతిన్‌ తనకు అనుకూలంగా ఉపయోగించుకుంటాడు. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు.

ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ ప్రారంభమై 74 రోజులు గడిచాయి. అనుకున్న లక్ష్యాలు సాధించటంలో పెద్దగా విజయవంతం కాలేదు. ఉక్రెయిన్‌ను లొంగదీసుకోవడంలో ఎలాంటి పురోగతి లేదు. దాంతో రష్యా సైనిక ఉన్నతాధికారులలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలో విక్టరీ డే ఉక్రెయిన్‌కు పెద్ద ఝలక్‌ ఇచ్చే అవకాశాలను నిపుణులు కొట్టిపారేయటం లేదు. అదే రోజు అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్‌పై సైనిక చర్యను పూర్తి స్థాయి యుద్ధంగా ప్రకటిస్తారని బావిస్తున్నారు.

పుతిన్, ఆయన సలహాదారులు ఇప్పుడు తమ దృష్టిని పూర్తిగా ఈ చారిత్రక వార్షికోత్సవాలపై కేంద్రీకరిస్తారు. అధికారంపై పట్టు పెంచుకునేందుకు తప్పకుండా ఈ సందర్బాన్ని వాడుకుంటారు. పుతిన్, పుటినిజంకు ఇది చాలా ముఖ్యం కూడా. ఈ నేపథ్యంలో విక్టరీ డే నాడు పుతిన్‌ ఎటువంటి విజయ ప్రకటన చేస్తారనేది ఆసక్తిని కలిగిస్తోంది. యుద్దాన్ని మరో దశకు తీసుకువెళ్లే ప్రకటన చేస్తారని అంచనా. దీనిపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.

ఉక్రెయిన్‌ యుద్ధంలో పాల్గొనేందుకు పుతిన్ సామూహిక ప్రజా సమీకరణను ప్రకటించవచ్చని కొందరు అంచనా వేస్తున్నారు. ఇది కూడా ఆందోళన కలిగించే అంశం. యుద్ధం చేసే శక్తి సామార్థ్యాలు కలిగిన మాజీ సైనికులు, పౌరులను ఆర్మీలోకి తీసుకునే అవకాశం ఉంది. ఐతే, ఇలాంటి మాటలు గత మార్చిలో కూడా వినిపించాయి. దేశంలో మార్షల్ లా విధిస్తారని కూడా అన్నారు. పౌరులను నిర్బంధంగా సైన్యంలోకి తీసుకుంటారనే ప్రచారం జరిగింది. కానీ అవన్నీ గాలి వార్తలేనని తేలిపోయింది. ఒక వేళ పుతిన్‌ అలాంటి నిర్బంధ చర్యలకు దిగితే తీవ్ర వ్యతిరేకత వస్తుంది. వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలుపుతారు. కనుక పుతిన్‌ అలాంటి పిలుపులు ఇవ్వకపోవచ్చనే చాలా మంది నమ్ముతున్నారు.

ఇది ఇలావుంటే, విక్టరీ డే నాడు పుతిన్‌ ఉక్రెయిన్‌పై విజయాన్ని ప్రకటించుకునే అవకాశాలు చాలా తక్కువని పరిశీలకులు అంటున్నారు. కారణం, యుద్ధానికి ఇప్పట్లో తెరదించే ఉద్దేశం పుతిన్‌కు లేదని అంటున్నారు. సుదీర్ఘ కాలం యుద్ధం కొనసాగేలా పుతిన్‌ ప్రణాళిక సిద్ధం చేశారనే వాదన కూడా వినిపిస్తోంది.

1965లో నాటి సోవియట్ అధినేత బ్రెజ్నెవ్ ఆద్వర్యంలో తొలిసారి విక్టరీ డే సంబరాలు జరిగాయి. బ్రెజ్నెవ్‌ స్వయంగా రెండవ ప్రపంచ యుద్దంలో పాల్గొన్నాడు. ఉక్రెయిన్‌ సహా ఇతర మాజీ సోవియట్ దేశాలన్నీ దీనిని జరుపుకుంటాయి. ఐతే, 2015 నుంచి ఉక్రెయిన్‌ విక్టరీ డే మే 8కి మార్చింది. రెండవ ప్రపంచ యుద్ధ విజయాన్ని ఐరోపా దేశాలన్నీ మే 8న సెలబ్రేట్‌ చేసుకుంటాయి. ఉక్రెయిన్‌ కూడా ఇప్పుడు వాటిని అనుసరిస్తోంది. అంటే 2015 నుంచి ఉక్రెయిన్‌ పూర్తిగా రష్యా నుంచి పక్కకు జరిగిందని దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.

మే 8, 1945న అప్పటికి మిగిలిపోయిన జర్మన్ దళాలు సోవియట్‌ ఎర్రసైన్యం(రెడ్ ఆర్మీ) ముందు లొంగిపోయాయి. బెర్లిన్, మాస్కో మధ్య కాల వ్యత్యాసం వల్ల రష్యాలో మే 9ని విక్టరీ డేగా గుర్తించారు. నాజీ యిజంపై పోరాటంలో రష్యన్లు, ఇతర సోవియట్ యూనియన్‌ దేశాలు చేసిన అపారమైన త్యాగానికి చిహ్న్ం “విక్టరీ డే “.

జూన్ 22, 1941 న జర్మన్ సైన్యం సోవియట్‌ పై దాడికి దిగింది. దీనికి ఆపరేషన్ బార్బరోస్సా అని పేరు పెట్టారు. ఐతే, నాటి సోవియట్ పాలకుడు జోసెఫ్ స్టాలిన్ జర్మనీ తమపై యుద్ధానికి దిగుతుందని ఊహించలేదు. సోవియట్‌పై దాడికి దిగకుండా స్టాలిన్‌- హిట్లర్‌ మధ్య అప్పటికే ఒక ఒప్పందం ఉంది. అందుకే స్టాలిన్‌ అంత ధీమాగా ఉన్నాడు. ఐతే, హిట్లర్‌ దొంగ దెబ్బ గురించి విదేశీ దౌత్యవేత్తలతో పాటు ఆయన సొంత గూఢచార ఏజెంట్ల కూడా ముందస్తుగా హెచ్చరించారు. కానీ, ఆయన వాటిని పెడచెవిన పెట్టటంతో సోవియట్‌ ప్రజలు భారీ మూల్యం చెల్లించుకున్నారు.

సోవియట్‌తో యుద్ధం మూడంటే మూడు నెలలలో ముగిసిపోతుందని హిట్లర్‌ మొదట భావించాడు. తొలి రోజులలో నాజీలే పైచేయి సాధించాయి. కానీ రెడ్ ఆర్మీ ఓటమి వెనకడుగు వేయకుండా తెగించి పోరాడింది. యావత్‌ సోవియట్‌ ప్రజలు ఆ పోరాటన్ని తమ అస్థిత్వం పోరాటంగా బావించారు. ఆ సమయంలో నాజీ దళాలు చేయని అరాచకాలు లేవు. ఘోరాతిఘోరమైన యుద్ధ నేరాలకు పాల్పడ్డారు. యుద్ధ ఖైదీలతో పాటు సాధారణ పౌరులనూ సామూహికంగా ఉరితీశారు. ముఖ్యంగా యూదులను వెంటాడి వేటాడి చంపారు. ఉక్రెయిన్‌ లోని ఖార్కివ్ పై దాడికి దిగిన సమయంలో 15,000 మంది యూదులను ఊచకోత కోశారు.

1941-44 మధ్య లెనిన్‌ గ్రాడ్‌ ముట్టడిలో పది లక్షల మందికి పైగా పౌరులు చనిపోయారు. ఆ సమయంలోనే పుతిన్‌ పెద్ద సోదరుడు డిఫ్తీరియాతో కన్నుమూశాడు. రష్యన్‌ ఆర్మీలో పనిచేసిన ఆయన తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషయాలను పుతిన్‌ స్వయంగా వెల్లడించారు.

1943 నాటికి జర్మన్ల దూకుడును రష్యా గెరిల్లా పోరాటం ద్వారా కళ్లెం వేయగలింది. స్టాలిన్‌గ్రాడ్ సహా పలు చోట్ల హిట్లర్‌ దళాలు తోకముడిచాయి. ఎర్ర సైన్యం జర్మన్లను రష్యా నుంచి తరమి తరిమి కొట్టింది. అలా మే 1945 నాటికి బెర్లిన్‌లోని రీచ్‌స్టాగ్‌ బిల్డింగ్‌పై ఎర్ర జెండా ఎగిరింది.

సోవియట్‌ యూనియన్‌పై జర్మనీ దాడికి సంబంధించి ఉక్రెయిన్‌ గురించి కూడా ఇక్కడ కొంత చెప్పాలి. సోవియట్‌ యూనియన్‌లో ఉక్రెయిన్‌ భాగం కావటం ఉక్రేనియన్‌ జాతీయవాదులకు ఇష్టం లేదు. అప్పటికే తిరుబాటు దళాలు సోవియట్‌పై విముక్తి పోరాటం సాగిస్తున్నాయి. కరుడుగట్టిన ఉక్రేనియన్‌ జాతీయవాది స్టెపాన్‌ బందేరా తిరుగుబాటు దళాలకు నాయకుడు. ఆ తిరుగుబాటు సైన్యం నాజీలతో చేతులు కలిపింది. ఇతర స్థానికులు జర్మన్ సహాయక దళాలలో చేరి బాబి యార్ మారణకాండ వంటి అనేక దురాగతాలకు తెగబడ్డారు. ఆనాడు జరిగిన ఊచకోతలో దాదాపు 34,000 మంది యూదులను కీవ్‌ సమీపంలో హత్య చేశారు. కొందరు ఉక్రెయినియన్లు ఇటువంటి ఘోరాలకు పాల్పడగా.. లక్షలాది మంది మంది ఉక్రేనియన్లు మాత్రం నాజీలపై వీరోచిత పోరాటం చేశారు. వేలాది మంది వీర మరణం చెందారు. అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించినందుకు గాను కీవ్‌, మాస్కో , లెనిన్‌గ్రాడ్‌ నగరాలు”హీరో సిటీ” అనే బిరుదును సొంత చేసుకున్నాయి.

ఐతే, ప్రస్తుతవ రష్యా చేస్తున్న యుద్ధానికి రెండవ ప్రపంచ యుద్దంతో ఎటువంటి సంబంధం లేదు. సోవియట్ వీరత్వం, దుష్ట నాజీల మధ్య యుద్దంగా దీనిని చూపేందుకు పుతిన్‌ ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుత ఉక్రెయిన్ ఆర్మీనీ నాటీ నాజీ అర్మీగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు పుతిన్‌. వాస్తవంగా ఆయన ఇప్పుడు నాజీలకు వ్యతిరేకంగా పోరాడటం లేదు. కారణం హిట్లర్‌ నాజీ సైన్యంలా ఉక్రెయిన్‌ ఏ దేశంపైనా దురాక్రమణకు దిగలేదు. రష్యా పట్ల నాటో కూడా దూకుడు ప్రదర్శించలేదు. ఐతే, రష్యాను నాటో చుట్టుముట్టడం ఒక్కటే ఈ యుద్ధానికి పుతిన్‌ చూపుతున్న అతి కారణం. ఇది చర్చల ద్వారా పరిష్కరించుకోదగిన సమస్య.. ఐనా పుతిన్‌ యుద్ధాన్ని ఎంచుకున్నాడు.

గతంలో పోలాండ్‌, యూకే, ఫ్రాన్స్‌, అమెరికా వంటి నాటో దేశాల ప్రతినిధులు విక్టరీ డే పరేడ్‌లో పాల్గొనేవారు. 2011లో జరిగిన రష్యా ఎన్నికలలో పుతిన్‌ రిగ్గింగ్‌ పాల్పడ్డారంటే పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. క్రమంగా పుతిన్‌ ఒక నియంతలా అధికారాన్ని పూర్తిగా తన గుప్పిట్లోకి తీసుకున్నాడు. దాంతో పశ్చిమ దేశాలతో రష్యా సంబంధాలు బలహీనపడ్డాయి.

ఈ ఏడాది విక్టరి డే పరేడ్‌కు ఏ విదేశీ నాయకుడినీ ఆహ్వానించలేదు. పుతిన్ సన్నిహిత మిత్రుడు, బెలారస్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకోను కూడా ఆహ్వానించలేదు. పుతిన్‌ మనసులో ఏముందో ..ఏం చేస్తాడో పసిగట్టటం కష్టం.. అందుకే యావత్‌ ప్రపంచం మే9 వైపు ఇప్పుడు ఆసక్తిగా చూస్తోంది!!

Exit mobile version