NTV Telugu Site icon

Gyanvapi Masjid : బాబ్రీ బాటలో జ్ఞాన్‌వాపి…?

Gyanvapi

Gyanvapi

వారణాసి లోని కాశీ విశ్వనాధ ఆలయ ప్రాంగణంలో ఉన్న జ్ఞాన్‌వాపి మసీదు వివాదం కేసు విచారణ వేగవంతమైంది. ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో వాదనలు శుక్రవారం ముగిశాయి. వారణాసి జిల్లా కోర్టుకు ఈ కేసును బదిలీ చేసింది. అనుభవజ్ఞులైన న్యాయమూర్తి దీనిని విచారించాలని ఆదేశించింది. సివిల్ వివాదంలోని అత్యంత సున్నితమైన అంశాన్ని పరిగణనలోకి తీసుకుని, కేసును సీనియర్ డివిజన్ సివిల్ జడ్జి నుంచి జిల్లా జడ్జికి బదిలీ చేస్తున్నట్టు సుప్రీంకోర్టు పేర్కొంది. సీసీపీ నిబంధన 11లోని 7 ప్రకారం పిటిషన్ దాఖలు చేశారని, ప్రాధాన్యతను జిల్లా జడ్జ్ నిర్ణయిస్తారని తెలిపింది.

విచారణ సందర్భంగా సర్వే నివేదికపై సర్వోన్నత న్యాయస్థానం కీలక సూచనలు చేసింది. మీడియాకు లీకులు ఇవ్వడాన్ని నిలిపివేయాలని సూచించింది. నివేదికను కేవలం న్యాయమూర్తి మాత్రమే బహిర్గతం చేయాలని జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. ఇవి సంక్లిష్టమైన సామాజిక సమస్యలని, వీటికి ఏ మానవ పరిష్కారమూ పరిపూర్ణంగా ఉండదని ఈ సందర్భంగా ధర్మాసనం అభిప్రాయపడింది.

మసీదు నిర్వహణ కమిటీ చేసిన విజ్ఞప్తిపై ప్రార్థనా స్థలాల పరిరక్షణ చట్టం 1991 కింద నిర్ణయం తీసుకుంటారని వ్యాఖ్యానించింది. 1991 ప్రార్థనా స్థలాల చట్టంలోని సెక్షన్ 3 ఓ ప్రదేశం మతపరమైన స్వభావాన్ని నిర్ధారించడం నిషేధించదని సుప్రీంకోర్టు పేర్కొంది. మే 17న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని, మసీదులో ముస్లింల నమాజ్‌కు ఎటువంటి ఆటంకం కలిగించవద్దని సూచించింది.

అంతకు ముందు మసీదు కమిటీ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది హుజెఫా అహ్మదీ.. జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌లో బయటపడిన ఆకారం శివలింగం కాదని, ఇది చెరువులోని ఫౌంటెన్‌కు చెందిన భాగమని తెలిపారు. చాలా ఏళ్లుగా ఇది మూతపడి ఉందన్నారు.

వాస్తవానికి, ఇప్పడు ఇంతలా చర్చనీయాంశమైన జ్ఞాన్‌వాపి మసీదు వివాదం కొత్తదేమీ కాదు. ఐతే, ఇప్పుడు దీనిపై వివాదం రేగటం వెనక రాజకీయ కోణం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంలో.. బాబ్రీ మసీదు కూల్చివేతకు ముందు, నాటి పీవీ.నరసింహ రావు సర్కార్‌ 1991లో చేసిన “ప్రార్థనా స్థలాల చట్టం” కీలకంగా మారింది.

అయోధ్య రామ్‌ టెంపుల్‌ నిర్మాణం కోసం బీజేపీ అగ్రనేత ఎల్‌ కే అద్వానీ 1990లో చేపట్టిన దేశ వ్యాప్త రథయాత్ర దేశ రాజకీయ పరిస్థితులను సమూలంగా మార్చింది. అయోధ్య ఉద్యమం నుంచి బీజేపీ ఎదుగుదల ప్రారంభమైంది. దాంతో పాటు, దేశంలో మత ఉద్రిక్తతలు పెరిగాయి. అయోధ్య వివాదం ప్రభావం ఇతర ప్రార్థనా స్థలాలపై పడకూడదనే ఉద్దేశంతో నాటి ప్రధాని నరసింహారావు 1991 సెప్టెంబర్ 18న “ప్రార్థనా స్థలాల చట్టం ” తీసుకువచ్చారు.

“ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్, 1991″ప్రకారం 1947 ఆగస్టు 15 నాటికి భారతదేశంలో ప్రార్థనా స్థలాలు ఏ రూపంలో ఉన్నాయో, అదే రూపంలో కొనసాగుతాయి. వాటి స్థితిగతులను మార్చటానికి వీలులేదు. కాశీలో జ్ఞాన్‌వాపి మసీదు అయినా, మధురలోని షాహీ ఈద్గా అయినా ఈ చట్టం పరిథిలోకే వస్తుంది. ఐతే, అప్పట్లో ఈ చట్టాన్ని బీజేపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఐతే, నేడు కేంద్రంతో పాటు యూపీలోనూ బీజేపీ అధికారంలో ఉంది. దాంతో ఈ చట్టం మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.

ఇది ఇలావుంటే, ముస్లిం నేతలు జ్ఞాన్‌వాపి మసీదు కేసును, బాబ్రీతో పోల్చుతున్నారు. ఈ రెంటి మధ్య కొంత సారూప్యత ఉందనే విషయాన్ని పరిశీలకులు సైతం అంగీకరిస్తున్నారు. అయితే సారూప్యతతో పాటు కొన్ని ప్రధాన వ్యత్యాసాలు కూడీ ఈ రెండి మధ్య ఉన్నాయనే విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.

అయోధ్య కేసు కోర్టు వెళ్లే నాటికి 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టం లేదు. 1947, ఆగస్ట్ 15 నాటికి ప్రజలు పూజలు నిర్వహిస్తున్న ప్రార్థనా స్థలాల్లో మార్పులు చేయకుండా ఈ కొత్త చట్టాన్ని తీసుకువచ్చారు. జ్ఞాన్‌వాపి కేసు 1991లో చట్టంగా మారిన తర్వాతే కోర్టుకు చేరింది. కనుక, జ్ఞాన్‌వాపి కేసుకు ఈ చట్టం ఒక రక్షణ కవచంలా ఉంది. కొత్త చట్టంలో..స్వాతంత్య్రానికి ముందు అని పేర్కొనటంతో అయోధ్య దాని నుంచి మినహాయింపు పొందింది.

బాబ్రీ వివాదం పై మొదట్లో న్యాయస్థానాల్లో పోరాటం సాగింది. తర్వాత వీహెచ్‌పీ, బీజేపీ అందులో చేరాయి. అలాగే, జ్ఞాన్‌వాపి వివాదంపై కూడా 1991 నుంచి న్యాయ పోరాటం జరుగుతోంది. దీని విషయంలో కూడా వీహెచ్‌పీ, ఆరెస్సెస్, బీజేపీ నుంచి క్రమంగా ప్రకటనలు వెలువడుతున్నాయి. మొఘల్ ఆక్రమణదారులు హిందూ సంస్థలను నిర్మూలించడానికి ప్రయత్నించారని చెబుతున్నారు. అంతేకాదు, జ్ఞాన్‌వాపి, తాజ్‌మహల్, కృష్ణ జన్మభూమి గురించి నిజానిజాలు బయటికి రావాలనే డిమాండ్‌ పెరిగింది.

కోర్టు ఆదేశాల మేరకు జ్ఞాన్‌వాపి మసీదు సర్వే జరిగింది. ఈ సర్వేలో మసీదు ప్రాంగణం సర్వేలో శివలింగం బైటపడటం వివాదాస్పదమైంది. ఆ ప్రాంతాన్ని సురక్షితంగా ఉంచాలని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఈ వాదన, 1949లో అయోధ్యలో రాంలాలా విగ్రహం ఉందనే వాదనకు దగ్గరగా ఉంది. ఈ కోణంలో చూస్తే, జ్ఞాన్‌వాపి కూడా అయోధ్య దారిలో సాగుతున్నట్లు కనిపిస్తోందని రాజకీయ, సామాజిక పరిశీలకులు అంటున్నారు. ఈ విషయం కోర్టులో సత్వరం పరిష్కారం కాకపోతే బాబ్రీ లాగే ఏళ్ల తరబడి సాగవచ్చు. 2024 సార్వత్రిక ఎన్నికల వరకు కూడా వెళ్లొచ్చు. రెండు చోట్లా మసీదులున్నాయి. రెండు చోట్లా అంతకు ముందు ఆలయం ఉందన్న వాదన ఉంది. ఐతే, ఇదే సమయంలో ఈ చరిత్ర తప్పు అనే వారు కూడా ఉన్నారు. కనుక, ఈ రెండింటికి పోలిక ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా కోర్టు తీర్పు వచ్చే వరకు ఎవరైనా వేచి చూడాల్సిందే. ఈ లోగా దీని మీద ఏ స్థాయిలో రాజకీయం జరుగుతుందో కూడా చూస్తాం!!