Site icon NTV Telugu

Patient Transport On JCB: అంబులెన్స్ వుండదు.. జేసీబీపై ఆస్పత్రికి పేషెంట్… ఏంటీ దుస్థితి?

Jcb And Hads

Jcb And Hads

మనదేశంలో ఆస్పత్రుల్లో వైద్య సదుపాయాలు ఎలా వున్నా.. ఆస్పత్రికి రోగుల్ని తరలించే సౌకర్యాలు మాత్రం తక్కువనే చెప్పాలి. నిండు గర్భిణీలను గిరిజన ప్రాంతాల నుంచి తరలించాలంటే డోలి వాడాలి. వారి ప్రాణాలకు, వారి కడుపులోని శిశువులకు గ్యారంటీ వుండదు.. ఆఖరికి ఆస్పత్రిలో చనిపోయిన వారి శవాలను కూడా తమ స్వస్థలాలకు తీసికెళ్ళేందుకు అంబులెన్స్ లు వుండడం లేదు. వున్నా.. వాటికి చెల్లించేందుకు భారీ మొత్తాలను ఖర్చుపెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. దీంతో టూ వీలర్ల మీద, సైకిళ్ళ మీద శవాలను తరలించాల్సి వస్తోంది. ఇదంతా ఒక ఎత్తయితే.. అంబులెన్స్ లు లేక జేసీబీల ద్వారా రోగిని ఆస్పత్రికి తరలించిన ఘటన మధ్యప్రదేశ్ లోని కట్నీలో చోటుచేసుకుంది.

కట్నీలో ఓ వ్యక్తి బైక్ పై వెళుతుండగా ప్రమాదానికి గురయ్యాడు. అయితే అతడిని ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్ సౌకర్యం అందుబాటులో లేదు. దీంతో అక్కడే వున్న జేసీబీ సాయంతో అతడిని ఆస్పత్రికి తరలించి అత్యవసర చికిత్ప అందించాల్సి వచ్చింది. స్థానికుల సాయంతో జేసీబీ నుంచి రోగిని చేతుల్లో మోసుకుంటూ ఆస్పత్రిలో చేర్చారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మనదేశంలో వైద్యరంగంలో దుస్థితి ఇలా వుందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Read Also: Santosh Kumar: ఆసియాలోనే రెండో అతిపెద్ద మర్రిచెట్టు పరిరక్షణకు నడుం బిగించిన టీఆర్ఎస్ ఎంపీ

మధ్యప్రదేశ్ లో ఈ ఘటన జరిగితే.. పక్కనే వున్న యూపీలో రెండేళ్ల తమ్ముడి మృతదేహాన్ని పదేళ్ల బాలుడు తన చేతుల్లో మోశాడు. బాగ్‌పత్‌ జిల్లాలో జరిగిందీ ఘటన. ఏడుస్తున్న రెండేళ్ల కాలా కుమార్‌ను సవతి తల్లి సీత కదులుతున్న వాహనం కిందకు తోసేసింది. దీంతో ఆ బాలుడు మరణించాడు. ఆ బాలుడి మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టం కోసం తరలించారు. అనంతరం శవాన్ని 40 కిలోమీటర్ల దూరంలోని తమ ఊరికి పంపాలని ఆస్పత్రి వైద్యుల్ని కోరినా ఆ బాలుడి వినతిని పట్టించుకోలేదు.

దీంతో చేసేదేమీ లేక బాలుడి మృతదేహాన్ని తండ్రి చేతుల్లో మోసుకుని ఆసుపత్రి నుంచి గ్రామానికి బయలుదేరాడు. మధ్యలో కొంతదూరం అన్న మోసాడు. దీనిని గమనించిన స్థానికులు వీడియో తీయడంతో ఉన్నతాధికారులు స్పందించి అంబులెన్స్ ఏర్పాటుచేశారు. పదేళ్ల బాలుడు తన రెండేళ్ల తమ్ముడి మృతదేహాన్ని చేతుల్లో మోస్తూ నడుస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అయింది. తాజాగా ఈ జేసీబీ వీడియో ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. ప్రభుత్వాలు సామాన్యుల ఆరోగ్యంపట్ల ఎంత అశ్రద్ధ కనబరుస్తున్నాయో ఈ ఘటనలు ఉదాహరణలు. ఈ దుస్థితి, దౌర్భాగ్యం మారాలంటే ఇంకెన్ని స్వాతంత్య్ర దినోత్సవాలు రావాలి… ఆజాదీకా అమృత్ మహోత్సవాలు ఇంకెన్ని రావాలి?

Read Also: Madhya Pradesh: యాక్సిడెంట్ బాధితుడిని బుల్డోజర్‌లో ఆసుపత్రికి తరలింపు.. వీడియో వైరల్

Exit mobile version