సాధారణంగా ఎన్నికలు వస్తున్నాయంటే నేతలకు గుబులు పుడుతుంది. కానీ ఓటర్లకు మాత్రం పండగే. ముఖ్యంగా మందుబాబులకు. నామినేషన్ వేసింది మొదలు పోలింగ్ వరకు తాగినోడికి తాగినంత. రోజంతా మత్తులోనే. ఎవరిని పలకరించినా మాటలు మత్తు మత్తుగా వస్తాయి. ఊళ్లలో మద్యం ఏరులై పారుతుంది. ఉప ఎన్నికలు జరుగుతున్న హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పుడు అదే జరుగుతోంది. ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాలేదు. కానీ ఎక్కడ చూసినా పండగ వాతావరణమే. ఎన్నికలు ఎప్పుడైనా పెట్టనీ అప్పటి వరకు ప్రధాన పార్టీల నేతలకు చేతినిండా పని. వారు ఇప్పటి నుంచే ఓటర్లను వలలో వేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికల రెండు ప్రధాన పార్టీల మధ్య హోరాహోరికి వేదికగా మారింది. దాంతో ఇరు పక్షాలు ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకునేందుకు సిద్ధంగా లేరు. ఎంత ఖర్చయినా కానీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నారు. గత రెండు నెలలుగా నియోజకవర్గలో మద్యం వరద పారుతోంది. మద్యం కోసం నాయకులు ఏకంగా కార్యకర్తలకు మందు, మాంసం టొకెన్లు ఇస్తున్నారు. సాయంత్రం ప్రచారం ముగియగానే దారులన్నీ బార్ల వైపే. నియోజకవర్గంలో ఉన్న బెల్టు షాపులు, వైన్ షాపుల పర్మిట్ రూములు, బార్ అండ్ రెస్టారెంట్లన్నీ హౌస్ ఫుల్ అవుతున్నాయి.
హుజురాబాద్ నియోజకవర్గంలో మొత్తం 29 వైన్ షాపులున్నాయి. హుజురాబాద్ టౌన్‌తో పాటు ఆ మండల పరిధిలో 9 షాపులున్నాయి. వీణవంక , ఇల్లందకుంట , జమ్మికుంటలలో కలిపి 15, వరంగల్ జిల్లా పరిధిలో ఉన్న కమలాపూర్ లో 5 మద్యం దుకాణాలు ఉన్నాయి . ఇక ప్రతి గ్రామంలో బెల్టు షాపులు కనిపిస్తాయి. ఈటల ఎపిసోడ్ తరువాత రాజకీయంగా హుజూరాబాద్ ప్రధాన వార్తల్లో నిలుస్తోంది. నియోజకవర్గంలో పొలిటికల్ యాక్టివిటీ పెరిగింది. ఈ నేపథ్యంలో గత మూడు నెలలుగా మద్యం ఏరులై పారుతుంది. అంతకు ముందు జూన్ , జూలైలో అయితే ఒక్కసారిగా అమ్మకాలు పెరిగినట్టు లెక్కలు చెబుతున్నాయి. హుజూరాబాద్ నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాల్లోని మద్యం షాపుల్లో వందకోట్ల వ్యాపారం జరిగినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
మరోవైపు, ఎలక్షన్ కమిషన్ ఈ ఎన్నికలను వాయిదా వేయటం. అలాగే గత నెల శ్రావణమాసం కావటంతో మద్యం అమ్మకాలు కొంత నెమ్మదించాయి. అయితే ఇప్పుడు మళ్లీ ప్రచారం వేడెక్కటంతో లిక్కర్ అమ్మకాలు కూడా పెరిగాయి.
ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా మారాయి. పొలిటికల్ పార్టీలలో హుజూరాబాద్ ఫీవర్ పెరిగింది. టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య హోరాహోరికి రంగం సిద్ధమైంది. ఇటు బీజేపీ, అటు టీఆర్‌ఎస్ నేతలంతా హుజూరాబాద్‌లో క్యాంపు వేసి రాజకీయం నడుపుతున్నారు. హరీష్ రావు సారధ్యంలో టీఆర్‌ఎస్ ప్రచారంలో దూసుకుపోతోంది.
వాస్తవానికి గత నెలలోనే ఎన్నికలు ఉంటాయని అంతా బావించారు. పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందుకోసం పార్టీ నేతలను మండలాల వారీగా ఇంచార్జ్‌లుగా నియమిమించి క్యాంపు రాజకీయాలు ప్రారంభించారు…ఇలా ఇరు పార్టీలు పోటాపోటీగా దూసుకుపోతున్న క్రమంలో విందు రాజకీయాలు కూడా జోరం దుకున్నాయి . అయితే ఎన్నికలు దసరా వెళ్లిన తరువాత జరిగే అవకాశం వుంది. ఆలస్యం అయినా సరే ..కానీ ప్రచారంలో టెంపో తగ్గొద్దన్నదే పార్టీల ప్లాన్. ఇప్పుడు హుజూరాబాద్‌లో జరుగుతున్నది కూడా అదే!!
