తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా హుజూరాబాద్ ఉప ఎన్నికపైనే చర్చ నడుస్తోంది. గడిచిన ఐదు నెలలుగా హుజూరాబాద్ లో రాజకీయ వేడిరాజుకుంటోంది. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ హుజూరాబాద్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారాన్ని పెద్దఎత్తున చేపడుతున్నాయి. మరో నాలుగు రోజుల్లో ప్రచారానికి తెరపడుతుండటంతో ఆయా పార్టీల ముఖ్య నేతలంతా కూడా హుజూరాబాద్ లోనే తిష్టవేసి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన ఈసారి బీజేపీ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇక టీఆర్ఎస్ నుంచి యువ నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట్ బరిలో ఉన్నారు. అయితే ప్రధాన పోటీ మాత్రం బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్లుగా మారింది. హుజూరాబాద్ స్థానాన్ని తిరిగి దక్కించుకోవాలని సీఎం కేసీఆర్ భావిస్తుండటంతో ఇక్కడ పోటీ రసవత్తరంగా మారింది.
ఇదిలా ఉంటే తెలంగాణలో కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టలేదు. దీంతో ఎన్నికల కమిషనర్ కరోనా నిబంధనలు పాటించని వారిపై కోరఢా ఝళిపిస్తోంది. కోవిడ్, ఎన్నికల నియామవళిని పాటించని నేతల విషయంలో కఠిన వైఖరిని అవలంభిస్తోంది. కేసుల భయంతో నేతలంతా తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటిస్తున్నారు. ఇదే సమయంలో పలువురు నేతలు కరోనా బారినపడటంతో నేతల్లో టెన్షన్ నెలకొంది. ఇటీవల మంత్రి గంగుల కమాలకర్ కరోనా బారిన పడటంతో ఆయన సన్నిహితులంతా ఆస్పత్రులు చుట్టూ తిరగాల్సి వచ్చింది.
పోలింగ్ సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో హుజూరాబాద్ లో వాక్సినేషన్ స్పీడుగా జరుగుతోంది. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 97.6శాతం తొలి డోస్ పూర్తికాగా.. 59.9శాతం సెకండ్ డోస్ పూర్తయినట్లు ఈసీ పేర్కొంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఇప్పటికే వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తయినట్లు స్పష్టం చేసింది. ఉప ఎన్నిక సజావుగా జరిగేందుకు 20 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించనున్నట్లు తెలిపింది. ఇప్పటివరకు 1.80కోట్ల నగదు, 6.11లక్షల విలువైన మద్యం సీజ్ చేసినట్లు ఈసీ పేర్కొంది.
పోలింగ్ సమయానికి వ్యాక్సినేషన్ మరింత పుంజుకునే అవకాశం కన్పిస్తోంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. దీంతో ఓటర్లు భారీగానే పోలింగ్ కేంద్రానికి తరలి వచ్చే అవకాశం ఉంది. దీనికితోడు ఈసారి కొత్త ఓటర్లు కూడా భారీగా పెరిగారు. ఈమేరకు పోలింగ్ శాతం గతంలో కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశాలున్నాయని సమాచారం. దీంతో హుజూరాబాద్ ఓటర్లు ఏమేరకు గత పోలింగ్ రికార్డును తిరుగ రాయనున్నారనేది ఆసక్తికరంగా మారింది.