Site icon NTV Telugu

గుడివాడ క్యాసినో ఎపిసోడ్ కంటిన్యూస్‌…

గుడివాడ క్యాసినో వివాదం మ‌రింత ముదిరింది. ఈ వ్యవహారం రాజ‌కీయ రంగు పులుముకోవ‌టంతో విష‌యం మ‌రింత వేడెక్కింది. మంత్రి కొడాలి నాని, టీడీపీ నేత‌ల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతూనే ఉన్నాయి. ఇంకోవైపు కోడాలి నానిని మంత్రివ‌ర్గం నుంచి భ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని బీజేపీ డిమాండ్ చేస్తోంది. మ‌ధ్య‌లో రాంగోపాల్ వ‌ర్మ వంటివారు సెటైర్స్ వేస్తున్నారు. మొత్తానికి ఇప్ప‌డు ఏపీ రాజ‌కీయాలు గుడివాడ క్యాసినోవా చుట్టే తిరుగుతున్నాయి. ఉద్యోగుల ఆందోళ‌న కూడా పక్కకు పోయింద‌నిపిస్తోంది.

మంత్రి కొడాలి నాని తాజా ప్రెస్‌మీట్‌లో త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌ను మ‌రోసారి తిప్పికొట్టారు. త‌న క‌న్వెనషన్‌ సెంటర్లో క్యాసినో నిర్వహిస్తున్నార‌ని నిరూపిస్తే ఆత్మహత్య చేసుకుంటాన‌న్నాడు. అలాగే, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌పై తీవ్రస్థాయిలో విరుచుకుప‌డ్డారు. దాంతో, టీడీపీ నేత‌ల నుంచి కూడా అదే స్థాయిలో రియాక్షన్స్‌ వ‌స్తున్నాయి.

సంక్రాంతి ముసుగులో కొడాలి నాని క్యాసినో నిర్వహించారని ఆరోపిస్తూ కాసినోకు దృశ్యాలు బయటకు రాగానే ఆయనపై కేసు నమోదు చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. కొడాలి నాని, ఆయన అనుచరులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక టీడీపీ సభ్యులు కృష్ణా జిల్లా ఎస్పీకి ఫోన్ చేశారు. దాంతో ఇరు వ‌ర్గాలు మాటల యుద్ధానికి దిగడంతో వివాదం రచ్చకెక్కింది. గత వారం, టీడీపీ నిజ నిర్ధార‌ణ క‌మిటీ సభ్యులు గుడివాడలో కన్వెన్షన్ సెంటర్‌కు వెళ్లాల‌ని ప్రయత్నించినప్పుడు కొడాలి నాని మద్దతుదారులు వారిపై దాడికి పాల్పడ్డారు.

మంత్రి నాని త‌నపై వ‌చ్చిన ఆరోపణలను ప‌దే ప‌దే ఖండిస్తూనే ఉన్నారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుతో పాటు మీడియాలోని ఒక వర్గం తనను ఇందులోకి లాగింద‌ని మంత్రి ఆరోపించారు. టీడీపీ తమ ఆరోపణలకు ఆధారాలు ఇస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కూడా అన్నారు.

ఈ నేపథ్యంలో సోమవారం విజయవాడలో మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విలేకరుల సమావేశంలో పోలీసు ఉన్నతాధికారుల మద్దతుతో జూదగృహం నిర్వహిస్తున్నందునే నానిపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ఇంటి గేటును ట‌చ్ చేసినా నానిని చంపేస్తానని కూడా బుద్దా బెదిరించాడు. డిజిపి అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని బుద్దా ఆరోపించారు. క్యాసినోలో రూ.200-300 కోట్లు చేతులు మారాయ‌ని… సీఎం వైఎస్‌ జగన్‌కు, పోలీసుల‌కు అందులో వాటా ఉంద‌ని అరోపించారు. అందుకే నానిని అరెస్ట్ చేయ‌లేద‌న్నారు. ఇది జ‌రిగిన కొన్ని గంట‌ల వ్యవధిలోనే వెంకన్నను పోలీసులు అరెస్టు చేశారు. అదే రోజు రాత్రి బెయిల్‌పై విడుదలచేశారు.

క్యాసినో ఆరోప‌ణ‌లపై కృష్ణా జిల్లా పోలీసులు జనవరి 20 న విచారణకు ఆదేశించారు. విజువల్స్‌లో ఒక వ్యక్తి టేబుల్‌పై కార్డులు డీల్ చేస్తూ కనిపిస్తుండగా, సింగ‌ర్స్ పాడుతుండ‌గా జనం డ్యాన్స్ చేస్తూ కనిపిస్తారు. మంత్రి కొడాలి నానికి చెందిన కన్వెన్షన్ హాల్‌లో సంక్రాంతి సంబరాల్లో వందల కోట్ల రూపాయల నగదు మార్పిడి జరిగిందని టీడీపీ నేత వర్ల రామయ్య డీజీపీకి లేఖ రాశారు.

క్యాసినో గుడివాడ‌లో జ‌రిగింద‌న‌టానికి టీడీపీ కొన్నా ఆధారాలు చూపిస్తోంది. సంక్రాంతి సందర్భంగా విజ‌య‌వాడ ద‌గ్గ‌ర‌ కాసినో నిర్వహిస్తున్నట్టు ఏసెస్ అనే కాసినో సంస్థ తన ఇన్‌స్టాలో ప్రకటించింది. ఆ పోస్టులో లొకేషన్ అనే చోట గుడివాడ అని చూపిస్తోంది.

గుడివాడ వచ్చి కాసినోలో పాల్గొన్న అమ్మాయిల వివరాలు అంటూ టీడీపీ ఒక లిస్టు విడుదల చేసింది. అందులో టికెట్లు బుక్ చేసిన ఎయిర్ లైన్స్ నంబర్లు, వారు విజయవాడ, బెంగళూరు మీదుగా గోవా వెళ్లిన విమానం వివరాలు, వారి పేర్లను వర్ల రామయ్య మీడియాకు విడుదల చేశారు. దాంతో ఈ వ్యవహారం మ‌రింత వేడెక్కింది.

క్యాసినో నడుపుతున్నారనే ఆరోపణలు రాగానే నూజివీడు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీనివాసులును దానిపై విచార‌ణ‌కు ఆదేశించారు కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్. ప్రస్తుతం విచార‌ణ కొన‌సాగుతోంది. 1867 పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ ప్రకారం భారతదేశంలోని ఇతర రాష్ట్రాల మాదిరిగానే ఆంధ్ర ప్రదేశ్‌లో కూడా క్యాసినో ను నిషేధించారు. ఈ కేసు విచార‌ణ‌లో ఏం జ‌రుగుతుందో…ఈ వ్య‌వ‌హారం ఎంత‌వ‌ర‌కు వెళుతుందో చూడాలి.

Exit mobile version