మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పండిస్తున్న పూల తోటల్లో చామంతి ఒకటి.. ఈ పూలు అన్ని కార్యక్రమాల్లో వాడుతారు.. దాంతో మార్కెట్ లో కూడా డిమాండ్ కూడా ఎక్కువే.. అందుకే రైతులు చామంతిని ఎక్కువగా పండిస్తున్నారు.. ఈ చామంతి శీతాకాలపు పంట. ఆరుబయట పెంచే చామంతి సెప్టెంబర్ చివరి నుండి మార్చి మాసం వరకు లభ్యమవుతుంది..పిలకలు, కొమ్మ కత్తిరింపుల ద్వారా ప్రవర్ధనం చేస్తారు. పూలు కోయటం పూర్తయిన తరువాత ఫిబ్రవరి, మార్చి మాసాల్లో మొక్కల కొమ్మలు కత్తిరించి ప్రవర్ధనం చేసుకుంటే మొక్కలు ఆరోగ్యంగా ఉండి పూలు నాణ్యత బాగుంటుంది..
ఒండ్రు నేలలు మరియు ఎర్రగరపనేలలు అత్యంత అనుకూలం. నల్లరేగడి నేలల్లో తేమ ఎక్కువగా ఉన్నట్లైతే వేరుకుల్లు అధికంగా ఆశించే అవకాశం ఉంటుంది. ఉదజని సూచిక 6-7 మధ్య ఉండాలి. మురుగు నీటి పారుదల సరిగా లేనిచో మొక్కలు చనిపోతాయి…ఇక చామంతి సాగుకు అనువైన సమయం.. జూన్, జూలై నుండి ఆగస్టు వరకు నాటుకోవచ్చు. మార్కెట్‌ను, పండుగల సీజన్ను దృష్టిలో ఉంచుకొని ఒకేసారి నాటుకోకుండా 15-20 రోజుల వ్యవధిలో రెండు – మూడు దఫాలుగా నాటితే పూలను ఎక్కువకాలం పొందే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.. వాతావరణాన్ని బట్టి నేల తీరును బట్టి ఇవ్వాలి. మొదటి నెలలో వారానికి 2-3 సార్లు వారానికొక సారి నీటి తడి ఇవ్వాలి.. ఇక ఈ పంటలో తెగుళ్లు కూడా కాస్త ఎక్కువే..
తెగుళ్లు మరియు నివారణ చర్యలు..
వేరుకుళ్లు తెగులు : భూమిలో తేమ అధికంగా ఉన్నట్లయితే వేరుకుళ్లు తెగులు సోకే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల లేత మొక్కలు అర్ధంతరంగా ఎండిపోతాయి..
నివారణ చర్యలు..
లీటర్ నీటిలో 3గ్రా.కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా 1గ్రా. కార్బెండజిమ్ కలిపి, తెగులు సోకిన మొక్కల పాదుల చుట్టూ నేలపై పోయాలి..
ఆకుమచ్చ తెగులు..
ఆకులమీద వలయాకారంలో గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. సెర్కోస్పొరా ఆకుమచ్చ వల్ల ఆకుల మీద ముదురు గోధుమ రంగులో మచ్చలు ఏర్పడి, చుట్టూ ఎరుపు వర్ణంతో మధ్యభాగం తెల్లగా ఉంటుంది..
నివారణ చర్యలు..
ఒక లీటర్ నీటిలో 2.5 గ్రా.మంకోజెబ్ లేదా 3గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ కలిపి 15రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి..
తామర పురుగులు..
వీటివల్ల పంట దిగుబడి బాగా తగ్గుతుంది.. అలాగే పూల నాణ్యత కూడా తగ్గుతుంది.. వీటిని త్వరగా గుర్తించి తగిన మందులు వెయ్యకుంటే తీవ్రంగా నష్టపోతారు..
నివారణ చర్యలు..
ఎకరానికి మలాథియాన్ 5 శాతం పొడి 8 కిలోలు లేదా క్వినాల్ఫాస్ పొడి 8 కిలోలు చల్లుకోవాలి. లేదా లీటర్ నీటిలో 2 మి.లీ. ఎండోసల్ఫాన్ కలుపుకుని పిచికారీ చేసుకోవాలి.. ఇంకేదైనా సమస్యల గురించి తెలుసుకోవాలంటే వ్యవసాయ నిపుణుల సలహా తీసుకోవడం మంచిది..