Lying Down Championship: ఎక్కడైనా పనిచేస్తేనే డబ్బులు వస్తాయి.. పనిచేయకపోతే డబ్బులు ఎవరూ ఊరికే ఇవ్వరు. కానీ ఆ దేశంలో నిద్రపోతే డబ్బులు ఇస్తారు. దీని కోసం పోటీ కూడా నిర్వహిస్తారు. ఎవరు ఎక్కువ సేపు నిద్రపోతే వాళ్లు విజేతగా నిలిచి డబ్బులను గెలుచుకుంటారు. ఇలాంటి పోటీలు యూరప్ ఖండంలోని మాంటెనెగ్రె దేశంలో జరుగుతున్నాయి. ఆ దేశంలోని ఓ గ్రామంలో ఏడాదికి ఓసారి నిద్ర పోటీలను (లైయింగ్ డౌన్ ఛాంపియన్‌షిప్) నిర్వహించి విజేతలకు నగదు బహుమతులతో పాటు ఇతర కానుకలు అందజేస్తున్నారు. మాంటెనెగ్రె దేశంలోని నిక్సిక్ గ్రామంలో దాదాపు 12 ఏళ్లుగా ఈ లైయింగ్ డౌన్ పోటీలు జరుగుతున్నాయి. ఈ ఏడాది కూడా 100 ఏళ్ల వయసున్న ఓ పెద్ద చెట్టు కింద మంచాలు వేసి ఈ పోటీ నిర్వహించారు.
Read Also: Andhra Pradesh: వినాయకచవితి మండపాలు ఏర్పాటు చేయాలంటే డబ్బులు కట్టాలా? దేవాదాయశాఖ ఏమంటోంది..?
ఈ నేపథ్యంలో ఈ పోటీలో జర్కో పెజనోవిక్ అనే యువకుడు పాల్గొని 60 గంటల పాటు మంచంపైనే నిద్రపోయి ఈ బహుమతి గెలుచుకున్నాడు. అతడికి బహుమతి కింద రూ.27 వేలు నగదు అందజేయడం సహా అతడితో పాటు మరొకరికి రెస్టారెంట్‌లో భోజనం, ఒక వీకెండ్ స్టే, రివర్ రాఫ్టింగ్ చేసే అవకాశాన్ని కల్పించారు. ఈ పోటీలో మొత్తం తొమ్మిది మంది పోటీపడ్డారు. వీరిలో ఏడుగురు తొలిరోజు సాయంత్రానికే ఓడిపోయారు. తరువాతి రెండు రోజులు మిగతా ఇద్దరే పోటీ పడ్డారు. చివరికి జర్కో పెజనోవిక్ గెలిచాడు. ఈ పోటీలో ఆరు బయటే చెట్టు కింద మంచాలపై పడుకోవాల్సి ఉంటుంది. అయితే వర్షం వచ్చినప్పుడు మాత్రం పక్కనే ఉన్న గుడిసెలోకి నిర్వాహకులు తరలిస్తారు. కాగా గత ఏడాది 117 గంటలపాటు పడుకుని ఉండి అలెక్సిక్ అనే వ్యక్తి బహుమతి అందుకున్నాడు. ఈసారి అందులో సగం సమయం మాత్రమే విజేత నిద్రపోయి బహుమతి గెలుచుకోవడం విశేషం.
