Site icon NTV Telugu

Viral Video: ఇది బైక్ కాదు.. మినీ వ్యాన్.. ఒకే బైకుపై ఏడుగురు ప్రయాణం

Bike Video

Bike Video

Viral Video: సోషల్ మీడియాలో వచ్చే వీడియోలు కొంచెం ఫన్‌గా ఉంటే చాలు నెటిజన్‌లు తెగ వైరల్ చేసేస్తున్నారు. ఇప్పుడు ఓ బైక్‌పై ఏడుగురు వెళ్తున్న వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. సాధారణంగా ఒక బైక్‌పై ఇద్దరు మాత్రమే ప్రయాణించగలరు. ట్రిపుల్ రైడింగ్ చేస్తే జరిమానా ఎదుర్కోక తప్పదు. అలాంటిది ఒకే బైకుపై ఏడుగురు వెళ్లడం అంటే మాములు మాటలు కాదు. దీంతో నెటిజన్‌లు ఈ వీడియో చూసి ఇది బైక్ కాదని.. మినీ వ్యాన్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

అయితే బైక్‌పై వెళ్తున్న వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారని నెటిజెన్లు చర్చించుకుంటున్నారు. ముందుగా ఒక వ్యక్తి బైక్‭పై కూర్చోగా.. ఇద్దరు పిల్లలు ఆయన ముందున్న పెట్రోల్ ట్యాంకుపై కూర్చున్నారు. అప్పటికే మరో ఇద్దరు పిల్లలు సహా ఇద్దరు మహిళలు బైక్ పక్కన ఎదురు చూస్తున్నారు. అనంతరం ఒక మహిళ బైక్ ఎక్కింది. ఆమెకు ఒక చిన్నారిని అందించిన మరో మహిళ.. తన చంకలో మరో చిన్నారిని ఎత్తుకుని ఆమె కూడా బైక్ ఎక్కింది. ఇలా బైక్‭పై ఏకంగా ఏడుగురు ఎక్కారు. వీరిలో ఏ ఒక్కరికీ కూడా హెల్మెట్ కూడా లేకపోవడం మరో గమనించాల్సిన విషయం.

బైక్‌పై ఏడుగురు వెళ్తున్న వీడియో చూసిన నెటిజన్‌లలో కొందరు ‘ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది’ అంటూ మండిపడుతున్నారు. ఇంత నిర్లక్ష్యంగా ఎలా బైక్‌పై ప్రయాణిస్తారంటూ కొందరు నెటిజన్‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం బస్ టిక్కెట్లు, రైలు టిక్కెట్లతో పాటు పెట్రోల్, డీజిల్ రేట్లు ఇష్టానుసారం పెంచితే సామాన్యులు ఇలాగే ప్రయాణిస్తారని కొందరు కౌంటర్లు వేస్తున్నారు. కాగా ఈ వీడియోను సుప్రియ సాహు అనే ఐఏఎస్ సోషల్ మీడియలో ‘స్పీచ్ లెస్’ అంటూ పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో అన్న విషయం మాత్రం తెలియరాలేదు.

Exit mobile version