సాధారణంగా జూ పార్కులకు వెళ్తే చాలా మంది అక్కడి జంతువులను చూసి మైమరిచిపోతుంటారు. కొన్ని జంతువులతో ఫోటోలు దిగాలని ఉవ్విళ్లూరుతారు. కానీ ఒక్కోసారి కొందరు జంతువుల ముందు అతిగా ప్రవర్తిస్తుంటారు. అలాంటి వ్యక్తులు జంతువులతో పరాచకాలు ఆడి ఏరికోరి కష్టాలను కొనితెచ్చుకుంటారు. ఇండోనేషియాలో కూడా ఓ యువకుడు ఇలాగే ప్రవర్తించి కష్టాల్లో పడ్డాడు. చింపాంజీతో ఆటలాడి కాసేపు గిలగిల లాడిపోయాడు. దీంతో సదరు వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. ఇండోనేషియాలోని కసాంగ్ కులిం అనే జూకు ఓ యువకుడు వెళ్లాడు. వెళ్లినోడు ప్రశాంతంగా జంతువులను చూసి ఆనందించకుండా ఓ చింపాంజీ ఉండే బోను ముందుకెళ్లి పరాచకాలు ఆడాడు. చింపాంజీని రా.. రా అంటూ చేత్తో పిలిచాడు. బోనులో నుంచి అది బయటకు ఏం వస్తుందిలే అని యువకుడు భావించాడు. అయితే యువకుడి పిచ్చి చేష్టలకు చింపాంజీ చూస్తూ ఊరుకుంటుందా.. రెండు చేతులు బయటకు పెట్టి యువకుడి షర్టును గట్టిగా పట్టేసుకుంది.అనంతరం తన రెండు చేతులతో యువకుడి కాళ్లను బంధించింది. చింపాంజీ నుంచి విడిపించుకోవడానికి యువకుడు నానా కష్టాలు పడ్డాడు. చివరకు ఎలాగోలా అక్కడే ఉన్నవాళ్లు చింపాంజీ నుంచి యువకుడికి విముక్తి కల్పించారు. ప్రస్తుతం ఈ వీడియోను చూసి నెటిజన్‌లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. అయితే నాతోనే గేమ్స్ ఆడతావా అంటూ చింపాంజీ ఇచ్చిన లుక్స్ నెటిజన్‌లను ఆకట్టుకుంటున్నాయి.