ప్రస్తుతం చాలా మంది ఆన్‌లైన్‌లో ఫ్లిప్ కార్ట్, అమెజాన్ ద్వారా పలు వస్తువులను ఆర్డర్ చేస్తుంటారు. ఈ-కామర్స్ సైట్‌లో బుక్ చేసే ఆర్డర్ మీకు ఎలా డెలివరీ అవుతుందని ఎప్పుడైనా ఆలోచించారా? అయితే చాలా మంది బుక్ చేసే పార్శిళ్లలో వస్తువులు డ్యామేజ్ అయితే డెలివరీ బాయ్స్ కారణమని నిందిస్తుంటారు. కానీ ఆ పార్శిళ్లు ఎక్కడి నుంచి రవాణా అయ్యాయి.. ఎలా రవాణా అయ్యాయన్న విషయాన్ని మాత్రం పట్టించుకోరు. ఈ నేపథ్యంలో పార్శిల్ భద్రత గురించి డెలివరీ కంపెనీలు ఎంతగా ఆందోళన చెందుతున్నాయో తెలిపే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ నుంచి వచ్చే డెలివరీ పార్శిళ్లను రైల్వే ఉద్యోగులు తమకు ఇష్టం వచ్చినట్లు విసిరి పడేస్తున్న వీడియోను అభిషేక్ యాదవ్ అనే వ్యక్తి ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.
పార్శిల్ బాక్సులను పలువురు రైల్వే ఉద్యోగులు తమకు ఇష్టం వచ్చిన రీతిలో రైల్వే ప్లాట్‌ఫారమ్‌పైకి విసిరేస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ దృశ్యాన్ని చూస్తే పార్శిళ్లు బుక్ చేసే వాళ్లు షాక్‌కు గురవడం ఖాయం. ఆయా పార్శిల్ బాక్సులలో ఎలాంటి వస్తువులు ఉన్నాయన్న విషయాన్ని కూడా రైల్వే ఉద్యోగులు పట్టించుకోకుండా ఎలా పడితే అలా విసిరేస్తుండటంపై పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. ఒకవేళ బాక్సులలో ఐటమ్స్ పాడైపోతే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు.
రైల్వే ఉద్యోగులు విసిరేస్తున్న బాక్సులు ఏ బ్రాండ్‌కు చెందినవో స్పష్టంగా కనిపించకపోయినా చాలా బాక్సులపై ఉన్న వైడ్ బ్లాక్ టేప్ అమెజాన్‌కి చెందినదిగా కనిపిస్తుందని ఓ వినియోగదారుడు సూచించాడు. ఎందుకంటే అమెజాన్ ప్రత్యేకమైన ట్యాపింగ్‌తో పార్శిళ్లను పంపుతుంది. కానీ అక్కడ ఉన్న పార్శిళ్లలో ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన పార్శిళ్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. రైల్వే ఉద్యోగులు విసిరేస్తున్న పార్శిళ్లలలో ఒకటి ఫ్యాన్‌కు తగిలి ప్లాట్‌ఫారమ్‌పై పడి ఉన్న భారీ ప్యాకేజీల కుప్పపైకి పడిన దృశ్యాన్ని కూడా వీడియోలో చూడొచ్చు.
Amazon & Flipkart parcels 😂https://t.co/ihvOi1awKk
— Abhishek Yadav (@yabhishekhd) August 29, 2022
