NTV Telugu Site icon

VandeBharat Train Speed: వందే భారత్ రైలు ఘనత.. గంటకు 180 కి.మీ వేగం

Vande Bharat

Vande Bharat

భారతీయ రైల్వేలు మరో ఘనతను సాధించాయి. వందే భారత్‌ పేరుతో సూపర్‌ ఫాస్ట్‌ ట్రైన్‌ సరికొత్త రికార్డు సృష్టించింది. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లి కొత్త మైలురాయిని అందుకుంది. ఈ విషయాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ స్వయంగా ట్వీట్‌ చేసి వివరాలను వెల్లడించారు. ఢిల్లీ-ముంబై రైలు మార్గంలో తాజాగా ట్రైల్‌ రన్‌ రైల్వే శాఖ నిర్వహించింది. కోటా నుంచి మహిద్‌పూర్ రోడ్‌ స్టేషన్‌వరకు 180 కిలోమీటర్ల వేగంతో వందే భారత్‌ దూసుకెళ్లింది. టెస్ట్‌ సమయంలోనే రైలులో వాషింగ్‌, క్లీనింగ్‌తో పాటు అన్ని పరికరాల పనితీరును పరిశీలించినట్టు రైల్వే మంత్రి తెలిపారు.

ఈ రైలును మొత్తం 16 కోచ్‌లతో ట్రైల్‌ నిర్వహించినట్టు వివరించారు. మంత్రి చేసిన ట్వీట్‌లో రైలు వేగాన్ని పరీక్షించే స్పీడో మీటరు పక్కనే గ్లాసు నిండా నీరున్నా ఒలకని వీడియోని మంత్రి ట్వీట్‌లో జతచేశారు. రైలు ఎంత స్పీడ్ వెళ్లినా నాణ్యత, భద్రతతో కూడిన ప్రయాణం అనుభూతి చెందవచ్చని రైల్వేమంత్రి తెలిపారు. సూపర్ రైడ్ క్వాలిటీ అంటూ మంత్రి కితాబిచ్చారు. వందే భారత్ రైళ్ల వేగంలో ధీటైనవి. వేగానికి తగ్గట్టుగా పటిష్టంగా వుండేలా ఈ రైళ్లను చాలా ప్రత్యేకంగా నిర్మించారు. ట్రయల్ కూడా హై లెవెల్‌లో పరీక్షిస్తున్నారు. ట్రైన్ స్పీడ్ ట్రయల్ తొలిదశలో 110 కిలోమీటర్లకు చేరుకుని అనంతరం రెండవ దశ ట్రయల్ రన్ లో గరిష్ట వేగం 180 కిలోమీటర్లకు చేరుకుంది.