పరీక్షలలో కొందరు విద్యార్థులకు సబ్జెక్ట్ రాకపోవడంతో విచిత్రంగా ఏదో ఒకటి రాసేస్తుంటారు. ఇలాంటి వాళ్లు పేపర్లు దిద్దే టీచర్లు దయతలచి తమను పాస్ చేయలేకపోతారా అని ధీమా వ్యక్తం చేస్తుంటారు. అయితే తమకు పాస్ మార్కులు వేయాలని కొందరు విద్యార్థులు జవాబు పత్రాల ద్వారా విజ్ఞప్తి చేస్తుంటారు. మరికొందరు మంచి మార్కులు వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరింపులకు పాల్పడుతుంటారు. తాజాగా హర్యానాలో జరుగుతున్న బోర్డు పరీక్షల్లో ఓ యువతి రాసిన మ్యాటర్ చూస్తే ఆశ్చర్యం కలగక మానదు.
ఓ పరీక్ష సందర్భంగా తన తండ్రి బాగా తాగుతాడని, సవతి తల్లి చేతిలో చిత్రహింసలకు గురవుతున్నానని ఓ విద్యార్థిని జవాబు పత్రంలో రాసుకొచ్చింది. తనకు ఆర్మీలో ఉద్యోగం చేయాలని ఉందని అందులో రాసింది. అయితే ఈ పరీక్షల్లో 75 శాతం మార్కులు రాకపోతే తన తండ్రి పెళ్లి చేస్తానని చెప్పాడని పేర్కొంది. కన్నకూతురిలా భావించి తనను పాస్ చేయాలని కోరింది. దీంతో ఇన్విజిలేటర్లకు ఏం చేయాలో పాలుపోలేదు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకురావడంతో ఈ న్యూస్ వైరల్ అవుతోంది. అటు మరో విద్యార్థి తాను మంచి విద్యార్థిని అని.. తనకు ఈ ప్రశ్నకు సమాధానం తెలియదని.. కావున దయచేసి పాస్ మార్కులు వేయాలని విజ్ఞప్తి చేశాడు. కాగా మరోవైపు పశ్చిమ బెంగాల్‌లో కూడా చాలా మంది విద్యార్థులు జవాబు పత్రాల్లో ఇటువంటి రాతలే రాయడం చర్చనీయాంశంగా మారింది.
