మంచి ఆకలి మీద వున్న మీరు ఏదైనా హోటల్ కి వెళ్ళి బిర్యానీ తినాలనుకుంటారు. బిర్యానీ పార్శిల్ తెచ్చుకుని తిందామని అనుకుంటే.. మీకు అనుకోని అతిథి వచ్చి మిమ్మల్ని డిస్ట్రబ్ చేస్తాడు. ఆ అతిథి ఎవరో కాదు ఏ బల్లో లేదా బొద్దింకో. అంతే మీ మూడ్ మొత్తం ఖరాబ్ అవుతుంది. హైదరాబాద్ కి చెందిన ఓ వినియోగదారుడి బిర్యానీలో బల్లి ప్రత్యక్షమయింది.
ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని ఓ బిర్యానీ హోటల్ లో బిర్యానీ కొన్నాడు రవిచారి. రాంనాగర్ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ అయిన రవిచారి ఈ బిర్యానీ కొని ఇంటికి తెచ్చుకున్నాడు. రవిచారి తెచ్చుకున్న బిర్యానీ పార్శిల్‌లో బల్లి ప్రత్యక్షమయింది. అది కూడా సగం బిర్యానీ తిన్న తరువాత బల్లిను గుర్తించాడా కార్పోరేటర్ రవిచారి. అంతే ఒక్కసారి ఒళ్ళంతా జలదరించింది. బల్లి వున్న బిర్యానీ తాను తిన్నానన్న విషయం గుర్తుకువచ్చి గొంతంతా ఏదో అయిపోయింది. ఒక్కసారిగా షాక్ అయ్యాడు రవిచారి.
ఈ అనుభవానికి ఖంగుతిన్న కార్పొరేటర్ రవిచారి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోని దిగారు పోలీసులు. బిర్యానీ పార్శిల్‌ని స్వాధీనం చేసుకున్న పోలీసులు టెస్టింగ్ కోసం ఫుడ్ కంట్రోల్ ల్యాబ్ కు పంపించారు. బిర్యానీ సెంటర్ వద్దకు చేరుకొని తనిఖీలు నిర్వహిస్తున్నారు ఫుడ్ ఇన్ స్పెక్టర్లు. నగరంలో నాసిరకం బిర్యానీలు అమ్ముతున్న బిర్యానీ సెంటర్లు ఎన్నో వున్నాయి. గతంలో పాచిపోయి, నిల్వ వున్న మాంసంతో తయారుచేసిన బిర్యానీలు తిని ఎంతోమంది వినియోగదారులు అస్వస్థతకు గురయ్యారు. నామ్ కే వాస్తేగా ఫుడ్ ఇన్ స్పెక్టర్లు తనిఖీలు చేస్తే ఇలాంటి చేదు అనుభవాలు వినియోగదారులకు ఎదురవుతూనే వుంటాయి. అందుకే వినియోగదారులు బిర్యానీ తినేముందు ఒకసారి దానిని పరిశీలించడం మంచిది.
Viral News: ముందుగా వచ్చిన రైలు.. ప్రయాణికుల డ్యాన్స్