కర్నూలు జిల్లాలోని అళ్లగడ్డ ఎగువ అహోబిలం ఆలయంలో చిరుత సంచరించింది. ఆలయంలోనే వెనుకవైపు ఉన్న ధ్వజస్థంబం నుంచి లోపలికి వచ్చిన చిరుత రామానుజాచార్యుల మండపం వద్ద ఉన్నకుక్కపిల్లలను లాక్కెళ్లేందుకు ప్రయత్నించింది. చిరుతను గమనించిన కుక్కలు ఒక్కసారిగా దాడి చేశారు. దీంతో బెదిరిపోయిన ఆ చిరుత అక్కడి నుంచి తోకముడిచి పారిపోయింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఎగువ అహోబిలం ఆలయంలోని రామానుజాచార్యుల మండపం వద్ద కుక్కపిల్లలు ఉన్నాయని ఎలా పసిగట్టిందని ఆశ్చర్యపోతున్నారు. అయితే, రెండు మూడు కుక్కలు అక్కడే ఉండటంతో చిన్న కుక్కపిల్లలు బతికి బట్టగట్టాయి.
Read: అలర్ట్: సైప్రస్‌లో పెరుగుతున్న డెల్టాక్రాన్ కేసులు…
లేదంటే దారుణం జరిగిపోయేది. అహోబిలం ఆలయంలోకి చిరుత ప్రవేశించినట్టు తెలుసుకున్న భక్తులు భయాందోళనలకు గురయ్యారు. స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులు బిక్కుబిక్కుమంటూ దర్శనం చేసుకున్నారు. గతంలోనూ చిరుతలు ఆళ్లగడ్డ-అహోబిలం రోడ్డులో దుర్గమ్మ ఆలయం వద్ద చిరుత కనిపించినట్టు అక్కడి ప్రజలు చెబుతున్నారు. తెలుగుగంగ కాల్వ దగ్గర రోడ్డుపై అడ్డంగా పడుకొని కనిపించిందని వాహనదారులు పేర్కొన్నారు. అయితే, కాసేపటి తరువాత ఆ చిరుత అక్కడి నుంచి అడవిలోకి వెళ్లిపోయిందని చెప్పుకొచ్చారు. అహోబిలంలో చిరుతల సంచారం అధికం కావడంతో ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు.