సంతకం పెట్టడంలో ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది. అయితే అందరూ సాధారణంగా వారి పూర్తి పేరును సంతకంగా పెట్టలేరు. అందుకే సంతకం చేసే సమయంలో తమ పేరును కుదిస్తారు. అయితే సంతకం అనేది సులువుగా ఉంటే సులువుగా కాపీ చేసే ప్రమాదం ఉంది. దీంతో సంతకం అర్థం కాకుండా పెట్టడం కూడా ఒక ఆర్ట్ అని చెప్పవచ్చు. ఈ విషయంలో కర్ణాటకలో పనిచేసే సబ్‌రిజిస్టర్ శాంతయ్య ప్రత్యేకంగా నిలిచారు. దీంతో ఆయన సంతకాన్ని ఏకంగా యునెస్కో అద్భుతమైన సంతకంగా కూడా గుర్తించింది.
వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక రాష్ట్రంలోని హోనావర్ సబ్ రిజిస్టర్ శాంతయ్య తన సంతకం విషయంలో అత్యంత జాగ్రత్తలు వహించారు. ఉద్యోగ విధుల్లో భాగంగా ఆయన నిత్యం సంతకాలు పెడుతుండాలి. అయితే తన సంతకాన్ని ఎవరూ కాపీ కొట్టకుండా… చాలా కష్టంగా సంతకం పెట్టడం నేర్చుకున్నారు. ఆయన పూర్తి పేరు కొంపల్ సోమపుర శాంతయ్య. ఆయన తన పేరును ఆంగ్లంలో కుదించి సంతకం చేయడం ప్రారంభించారు. అది కూడా చాలా కష్టతరంగా ఉండటంతో ఆయన సంతకం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ కళాకారుడు కళాకృతిని చిత్రీకరించినట్లు ఉండటంతో ఆయన సంతకాన్ని చూసి చాలా మంది నోరెళ్లబెడుతున్నారు. ఎవరైనా సంతకం సెకన్‌లలో చేసేస్తుంటారు. మహా అయితే ఒక నిమిషం వ్యవధి తీసుకుంటారు.
అయితే కేఎస్ శాంతయ్య సంతకాన్ని నిపుణులు కాపీ చేయాలంటే చాలా ఎక్కువ సమయం పట్టడం ఖాయం. శాంతయ్య 1994 నుంచి ఇలా సంతకం చేయడం నేర్చుకున్నారట. ఆయన సంతకాన్ని చూసి గతంలో హైకోర్టు న్యాయమూర్తి జిల్లా రిజిస్ట్రార్ ద్వారా ఇంటికి పిలిపించుకుని ప్రత్యేకంగా కూడా అభినందించారట. తాజాగా ఆయన సంతకాన్ని ఎవరో ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ సంతకం హాట్ టాపిక్‌గా మారింది. కాగా ఇలాంటి సంతకాన్ని ఆర్‌బీఐ గవర్నర్ కరెన్సీ నోట్లపై పెడితే ఎవరూ కరెన్సీ నోట్లను దొంగనోట్లుగా మార్చడానికి వీలుండదని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.