వాళ్ళు ముగ్గురున్నారు.. దొంగతనం చేసేందుకు కొన్ని రోజులపాటు ఓ అపార్ట్‌మెంట్‌లో రెక్కీ నిర్వహించారు.. ఎట్టకేలకు ఓ ఇంటికి ఎంపిక చేసుకున్నారు.. ఆ ఇంట్లో ఒక్కతే మహిళ ఉంటుందని గమనించి పక్కా ప్లాన్ వేసుకున్నారు.. దాదాపు ప్లాన్ వర్కౌట్ అయ్యిందని అనుకున్నారు.. ఇంట్లోకి వెళ్లి సామాన్లు దొంగలించడం ప్రారంభించారు.. చివర్లో ఆ మహిళ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది.. దీంతో ఆ దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. ఆ వివరాల్లోకి వెళ్తే…
గుజరాత్ రాష్ట్రం అదాజన్‌లోని సీకే విల్లా సొసైటీలో జిగ్యాసా తేజస్ అనే మహిళ ఒంటరిగా నివాసముంటోంది. ఈమె సింగిల్‌గా ఉంటుందన్న విషయం తెలుసుకున్న ముగ్గురు దొంగలు.. ఆమె ఇంట్లో దొంగతనం చేసేందుకు పక్కా ప్లాన్ వేసుకున్నారు. కార్పొరేషన్ ఉద్యోగులుగా మారువేషం వేసుకొని, ఆమె ఇంటికి వెళ్లారు. వాటర్ ట్యాంక్ తనిఖీ కోసం వచ్చామని చెప్పారు. వాళ్ల వేషధారణ ప్రభుత్వ అధికారుల లాగే ఉండటంతో.. వారిని నమ్మి లోపలికి ఆహ్వానించింది. ఇంట్లోకి వెళ్లిన తర్వాత ఆ ముగ్గురు దొంగలు మొదట్లో కాస్త బిల్డప్ ఇచ్చారు. వాటర్ ట్యాంక్ చుట్టూ పరిసరాలు గమనిస్తున్నట్టుగా నటించారు. ఈ క్రమంలోనే ఆమెకు క్లోరోఫామ్ ఇచ్చారు.
అయితే.. జిగ్యాసా కంగారు పడలేదు. వాళ్ల ప్రవర్తనతోనే దొంగలు అని పసిగట్టిన ఆమె.. క్లోరోఫామ్ ఇచ్చినప్పుడు కంగారుపడకుండా, తెలివిగా మూర్చపోయినట్టు డ్రామా ఆడింది. దాంతో ఆమె మత్తులోకి జారుకుందని భావించి.. హాల్‌లోనే ఆ మహిళను పడేసి, లోనికెళ్లి సామాన్లు దోచుకోవడం మొదలుపెట్టారు. అదును చూసుకున్న జిగ్యాసా.. వెంటనే బయటకు పరుగులు తీసి, ‘ఇంట్లో దొంగలు పడ్డారు’ అంటూ కేకలు వేసింది. ఈ దెబ్బతో ఖంగుతిన్న ఆ ముగ్గురు దొంగలు.. వెంటనే అప్రమత్తమై అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
