కొన్ని అకేషన్స్ సమయంలో పూలకి మహాగిరాకి ఉంటుంది. పండుగల సమయంలోనూ, వేడుకల సమయంలోనూ, పెళ్లిళ్ల సీజన్‌లోనూ పూలకు యమా గిరాకీ ఉంటుంది. పెళ్లిళ్లలో పూలతో అలంకరించడం కంటే బంగారం కొనుగోలు చేయడం మంచిదని అనుకునేంతగా ధరలు ఉంటాయి. పూలు లేకుండా పెళ్లిళ్లు జరగడం కష్టం. పెళ్లిళ్ల సమయంలో చాలా మంది పెళ్లి మండపాలనే కాకుండా కార్లను కూడా పూలతో అలంకరిస్తుంటారు. అయితే, మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి తన వివాహం సమయంలో వినూత్నంగా అలోచించాడు. పూలతో కారును అలంకరించాలంటే కనీసం రూ. 9 నుంచి 10 వేల వరకు ఖర్చు అవుతుంది.
Read: Rolls Royce: 111 ఏళ్ల తరువాత కీలక నిర్ణయం…
పైగా వేడుక ముగిసిన తరువాత పూలను పక్కన పడేయడం తప్పించి ఉపయోగం ఉండదు. అదే ఉపయోగపడే వస్తువులతో కారును అలంకరిస్తే బాగుంటుంది కదా అనుకున్నాడు. వెంటనే, కారును కుర్‌కురే ప్యాకెట్లతో అలంకరించాడు. పెళ్లిబరాత్ ముగిసిన తరువాత ఆ ప్యాకెట్లను అందరికి పంచిపెట్టాడు. మొత్తంగా కలిపి కారు అలంకరణ కోసం కేవలం రూ.1000 మాత్రమే ఖర్చు అయింది. కుర్‌కురే ప్యాకెట్లతో కూడిన కారు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.