Today (10-02-23) Business Headlines:
జెమినీ ప్యూర్ఇట్ సన్‌ఫ్లవర్ ఆయిల్
కార్గిల్ అనే సంస్థ ఇటీవల జెమినీ ప్యూర్ ఇట్ పొద్దు తిరుగుడు నూనెను విడుదల చేసింది. ఈ సన్‌ఫ్లవర్ ఆయిల్‌ని ఏపీ, తెలంగాణతోపాటు కర్ణాటక, తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాల మార్కెట్లలోకి కూడా అందుబాటులోకి తేనుంది. ఇది ప్రీమియం క్వాలిటీతో కూడిన ప్రొడక్ట్ అని కార్గిల్ ఫుడ్ ఇన్‌గ్రిడియెంట్స్ సౌత్ ఏసియా కన్జ్యూమర్ బిజినెస్ హెడ్ అవినాశ్ త్రిపాఠి తెలిపారు. ఈ సంస్థ రీసెంటుగా ఆంధ్రప్రదేశ్’లోని నెల్లూరులో ఒక ప్లాంట్’ను కొనుగోలు చేసి అక్కడ పొద్దు తిరుగుడు నూనె ఉత్పత్తిని ప్రారంభించింది.
క్రిప్టోల కట్టడికి దేశాలు సహకరించాలి
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ ఎండీ క్రిస్టలినా జార్జివాతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీ అయ్యారు. క్రిప్టో కరెన్సీల కట్టడికి ప్రపంచ దేశాల మధ్య పరస్పర సమన్వయం అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ నెల 20వ తేదీన బెంగళూరులో జీ20 దేశాల ఆర్థిక మంత్రులు మరియు కేంద్ర బ్యాంకుల గవర్నర్ల సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో దీనిపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు. ఇండియన్ ఎకానమీ పనితీరును IMF మేనేజింగ్ డైరెక్టర్ మెచ్చుకున్నారు.
55 ఏళ్ల గరిష్ట స్థాయిలో గోల్డ్ కొనుగోలు
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు గత సంవత్సరం బంగారాన్ని భారీగా కొనుగోలు చేశాయి. గడచిన 55 ఏళ్లలో కనీ వినీ ఎరగని రీతిలో 11 వందల 36 టన్నుల గోల్డ్’ను కొనిపెట్టుకున్నాయి. 2021వ సంవత్సరంతో పోల్చితే ఇది 686 టన్నులు ఎక్కువ కావటం చెప్పుకోదగ్గ విషయం. ఆర్థిక మాంద్యం భయాలు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర బ్యాంకులు ఇలా ముందుచూపు ప్రదర్శించటం ప్రాధాన్యత సంతరించుకుంది. విదేశీ మారక నిల్వల్లో భాగంగా ఈ విలువైన లోహాన్ని సొంతం చేసుకున్నాయి.
కెనరా బ్యాంక్’కి ప్రతిష్టాత్మక పురస్కారం
2021-22 ఆర్థిక సంవత్సరంలో కెనరా బ్యాంకు మంచి పనితీరు కనబరిచింది. డిజిటల్ చెల్లింపుల్లో టాప్ లెవల్’లో నిలిచింది. దీంతో ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకుంది. 44 ప్రభుత్వ మరియు ప్రైవేట్ బ్యాంకులు పోటీ పడగా కెనరా బ్యాంకు విజేతగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన డిజిటల్ ట్రాన్సాక్షన్స్ టార్గెట్’ని 131 శాతం సాధించింది. కొత్త బిజినెస్’ల నమోదు లక్ష్యాన్ని సైతం 116 శాతం అందుకుంది. మొత్తమ్మీద 92 స్కోర్’తో అన్ని బ్యాంకుల కన్నా అగ్ర స్థానాన్ని కైవసం చేసుకుంది.
డిజిటల్‌గానూ అందుబాటులోకి వెండి
వెండిని డిజిటల్ రూపంలో కొనుగోలు చేసే అవకాశం కూడా అందుబాటులోకి వచ్చింది. ఎంఎంటీసీ-పాంప్ అనే సంస్థ ఈ మేరకు ఒక పోర్టల్’ను లాంఛ్ చేసింది. వెండిని కొన్న అనంతరం డిజిటల్ వాల్ట్’లో దాచుకొని, కావాలనుకున్నప్పుడు భౌతిక రూపంలో ఉన్న వెండిని తీసుకోవచ్చు. ఒక్క రూపాయి విలువ చేసే డిజిటల్ సిల్వర్’ని సైతం కొనుక్కోవచ్చని ఎంఎంటీసీ-పాంప్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ వికాస్ సింగ్ చెప్పారు. ఇన్వెస్టర్లు ఎవరైనా ఈ పోర్టల్ ద్వారా డిజిటల్ సిల్వర్’ని కొనుక్కోవచ్చు.
‘అదానీ’ నుంచి వివరణ కోరనున్న ఎల్ఐసీ
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అదానీ గ్రూప్ సంస్థల్లో భారీగా పెట్టుబడి పెట్టినందువల్ల ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టీ ఈ రెండు సంస్థల పైనే ఉంది. ఇది రాజకీయంగా కూడా తీవ్ర చర్చనీయాంశమవుతోది. దీంతో ఎల్ఐసీలోని ఉన్నత స్థాయి యాజమాన్యం అదానీ గ్రూప్ మేనేజ్మెంట్’తో త్వరలో సమావేశం కానుంది. హిండెన్’బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ విడుదల అనంతరం అదానీ గ్రూపు ఎదుర్కొంటున్న సంక్షోభంపై వివరణ కోరనుంది. ఎల్ఐసీలోని పెట్టుబడుల విభాగం అధికారులు ఇప్పటికే అదానీ గ్రూపు నుంచి వివరణ కోరిన సంగతి తెలిసిందే.