Telangana Best in India: ఈఎస్‌జీ.. అంటే.. ఎన్విరాన్‌మెంటల్(పర్యావరణ), సోషల్(సామాజిక) మరియు గవర్నెన్స్(పాలన)పై హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్(హైసియా) శ్రద్ధ చూపటం పట్ల సీనియర్ ఐఏఎస్ అధికారి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్ హర్షం వ్యక్తం చేశారు. ఈఎస్‌జీపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించినందుకు హైసియాని ఆయన మనస్ఫూర్తిగా అభినందించారు. మనమంతా ఈఎస్‌జీపై సరైన సమయంలోనే దృష్టిపెడుతున్నామని అన్నారు. జాతీయ స్థాయిలో సౌర విద్యుదుత్పత్తి (పునరుత్పాదక ఇంధన వనరులు) 10 శాతంగానే ఉండగా రాష్ట్రంలో 16 శాతంగా నమోదైందని చెప్పారు.
తలసరి సౌర విద్యుదుత్పత్తిలో తెలంగాణ.. దేశంలోనే అత్యుత్తమ స్థాయిలో ఉందని పేర్కొన్నారు. గణాంకాల ప్రకారం చూస్తే కర్ణాటక తర్వాత ర్యాంక్ మనదేనని వెల్లడించారు. సోలార్ పవర్ జనరేషన్‌ను పెంచుకోవటం, రెన్యువబుల్ రిసోర్సులను సమర్థంగా వినియోగించుకోవటం గ్రీన్ ఎనర్జీ కమిట్‌మెంట్స్‌లో, కర్బన ఉద్గారాలను తగ్గించటంలో భాగమేనని వివరించారు. ఈ దిశగా విద్యుత్ వాహనాలను ప్రవేశపెట్టడంపై తెలంగాణ సంపూర్ణ అవగాహనతో, ప్రగతిశీలమైన విధానంతో ముందుకెళుతోందని అన్నారు.
read more: Special Story on Vikram S Kirloskar: మన దేశ ఆటోమొబైల్ రంగానికి మార్గదర్శకుడు
రాష్ట్రంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీని ప్రవేశపెట్టి కేవలం రెండేళ్లే అయినప్పటికీ ఎంతో ప్రోత్సాహకర వాతావరణం నెలకొందని చెప్పారు. విధానపరమైన లోపాలేమైనా ఉంటే సరిచేసుకుంటున్నామని తెలిపారు. తద్వారా ప్రజలు సంప్రదాయ వాహనాల నుంచి విద్యుత్ వాహనాల వైపు తేలిగ్గా మొగ్గు చూపేలా చర్యలు చేపడుతున్నామని వివరించారు. ఈ మేరకు చెప్పుకోవాలంటే చాలా ఉదాహరణలు ఉన్నాయని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇ-దిశగా (ఎలక్ట్రిక్ వాహనాల దిశగా) రెట్టించిన ఉత్సాహంతో ముందడుగు వేస్తోందని జయేష్ రంజన్ పేర్కొన్నారు.
హైసియాలో జరిగిన ఈ మీట్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఐటీ ఇండస్ట్రీలోని సీనియర్ బిజినెస్ లీడర్లు, సీఈఓలు/సీఓఓలు హాజరయ్యారు. ఈ సందర్భంగా హైసియా ప్రెసిడెంట్ మనీషా సబూ మాట్లాడుతూ సస్టెయినబిలిటీ ఇనీషియేటివ్స్ పరంగా హైదరాబాద్ చక్కని ప్రగతి కనబరుస్తోందని చెప్పారు. ఆసియా పసిఫిక్ సస్టెయినబిలిటీ ఇండెక్స్-2021లో భాగ్య నగరం 17వ ర్యాంక్ పొందిందని, తద్వారా బెంగళూరు, ఢిల్లీ, ముంబై సిటీల సరసన చేరిందని తెలిపారు.