Tata Motors: టాటా మోటార్స్ సంస్థ మరోసారి నిధుల సమీకరణ ప్రయత్నాలను మొదలుపెట్టింది. విద్యుత్ వాహనాల విభాగంలో వాటాల కేటాయింపు ద్వారా ఫండ్‌రైజ్ చేయనుంది. ఈ మేరకు వెల్త్ ఫండ్స్ మరియు ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్లతో చర్చలు జరుపుతోంది. రెండేళ్ల కిందట బిలియన్ డాలర్లను సమీకరించిన ఈ కంపెనీ ఇప్పుడు కూడా బిలియన్ డాలర్లను సేకరించనుంది.
ఈ నిధుల్లో ఎక్కువ శాతాన్ని అప్పులు తీర్చేందుకు వాడుకోనుంది. గతంలో ఈవీ మార్కెట్ వ్యాల్యూని 9 పాయింట్ 1 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. ఇప్పుడు 15 శాతం అదనంగా.. అంటే.. 10 పాయింట్ 5 బిలియన్ డాలర్లుగా లెక్కిస్తారు. ఈ మేరకు మోర్గాన్ స్టాన్లీని సలహా సంస్థగా నియమించుకుంది. టాటా మోటార్స్ విద్యుత్ వాహనాల విభాగంలో 11 నుంచి 15 శాతం షేర్లను ఇన్వెస్టర్లకు కేటాయిస్తారు.
read more: Air India: ఈ ఏడాది 5100 మంది క్యాబిన్ క్రూ, పైలట్ల నియామకం
2024 ఆర్థిక సంవత్సరం నాటికి రుణాలులేని సంస్థగా మారాలనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోవటంతో రెండోసారి నిధుల సమీకరణ ప్రణాళికలను రూపొందించింది. ఈ సంస్థ పోయినేడాది ఇండియాలో విద్యుత్ కార్ల వ్యాపారంలో ముందు వరుసలో నిలిచింది. దేశంలో విక్రయించిన ప్రతి 5 ఎలక్ట్రిక్ కార్లలో 4 కార్లు టాటా మోటార్స్‌వే కావటం విశేషం. అయితే.. అప్పులు మాత్రం 12 వేల 400 కోట్లు మిగిలాయి.
ఈ నేపథ్యంలో తాజాగా ఫండ్ రైజింగ్ చేస్తోంది. నిధుల కోసం టాటా మోటార్స్ చర్చలు జరుపుతున్న కంపెనీల లిస్టులో మొత్తం 6 సంస్థలు ఉన్నాయి. వాటి పేర్లు.. అబుదబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, ముబదల ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ, పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్, తెమసెక్ హోల్డింగ్స్, కేకేఆర్ మరియు జనరల్ అట్లాంటిక్.