దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభ కోల్పోయింది. ఉత్తరాదిలో పరిస్థితి ఏ మాత్రం బాగాలేదు. గత రెండు పర్యాయాల్లో లోక్‌సభ ఎన్నికల్లో ప్రదర్శన అత్యంత పేలవంగా ఉంది. ప్రస్తుతం కేవలం రెండు హిందీ రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది. అవి రాజస్థాన్, చత్తీస్‌గఢ్. ఇంటిపోరుతో మధ్యప్రదేశ్‌ను పోగొట్టుకుంది. ఉన్న రెండింటిలో చత్తీస్‌గఢ్ చిన్న రాష్ట్రం. మిగిలింది రాజస్థాన్. లోకసభ సీట్ల పరంగా చూసినపుడు ఇది మధ్యస్థ రాష్ట్రం. అంటే 20-39 ఎంపీ సీట్లున్న రాష్ట్రాలను మీడియం సైజ్ రాష్ట్రాలు అంటున్నారు. 25 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్న రాజస్తాన్ ఉత్తరాదిన కాంగ్రెస్‌కు అత్యంత ముఖ్యమైనది.
2019 సార్వత్రిక ఎన్నికల్లో రాజస్థాన్‌లో బీజేపీ స్వీప్ చేసింది. హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో గత ఎన్నికల్లో కాంగ్రెస్ రెండంటే రెండు సీట్లు మాత్రమే గెలిచింది. ఒకటి మధ్యప్రదేశ్ లో కమలనాథ్ కుమారుడు నకుల నాధ్ చింద్వారా నుంచి గెలవగా.. మరొకటి ఉత్తరప్రదేశ్‌లోని రాయ బరేలీ నుంచి సోనియాగాంధీ ఎన్నికయ్యారు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గెలుపు అవకాశాలున్న రాష్ట్రం రాజస్థాన్.
2018 చివరలో జరిగిన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీపై కాంగ్రెస్ బొటాబొటి మెజార్టీ సాధించింది. నిజం చెప్పాలంటే సాధారణ మెజార్టీ కూడా దక్కలేదు. ఇతరుల సహకారంతో ఆశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ఏర్పడింది. తరువాత ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలు చేరటం దానికి పెద్ద ఊరట. జాతీయ ఎన్నికలకు ఆరు నెలల ముందు మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. సార్వత్రిక ఎన్నికల మూడ్ ఎలావుంటుందో తెలియచేస్తాయి ఇవి. ఐతే ఒక్కోసారి పబ్లిక్ మూడ్ రివర్స్ అవుతుంది. 2018లో రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ గెలిచింది. కానీ తరువాత ఆరు నెలల్లోనే సీన్ మారింది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ సీట్లు సాధించగలిగింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ని కమలం పార్టీ స్వీప్ చేసింది. అంతకు ముందు 2003లో కూడా ఇలాగే జరిగింది. నాడు ఈ మూడు చోట్ల బీజేపీ ఘన విజయం సాధించింది. దాంతో వాజ్‌పాయ్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లింది. కానీ నిరాశ తప్పలేదు.
తిరిగి ప్రస్తుతానికి వస్తే, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ గతంలో రెండు సార్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఐతే, ఈ రెండు సందర్భాల్లోనూ కాంగ్రెస్ అధికారం నిలబెట్టుకోలేకపోయింది. 2014 ఎన్నికల్లో గెహ్లాట్ సారధ్యంలో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది. నిజానికి 1993 లో చివరి సారి బైరాంసింగ్ షెకావత్ తిరిగి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఆ తరువాత రాజస్థాన్‌లో ఏ పార్టీ వరసగా రెండు సార్లు గెలవలేదు. ఇప్పుడు కాంగ్రెస్ దీనిని బ్రేక్ చేయాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. ఐతే గెహ్లాట్ సారధ్యంలో అది సాధ్యం కాదని కాంగ్రెస్ హైకమాండ్‌కు ఇప్పటికే అర్థమైంది. అందుకే సరైన గెలుపు మార్గాలను అన్వేషిస్తోంది.
గత ఎన్నికల్లో కాంగ్రెస్..బీజేపీపై చాలా చాలా తక్కువ తేడాతో బయటపడిందని చెప్పుకున్నాం. ఇలాంటి బలహీన ప్రభుత్వాలను కూల్చేయటం మోడీ-షా బీజేపీ కి వెన్నతో పెట్టిన విద్య. మధ్యప్రదేశ్, కర్నాటకలో ఏం జరిగిందో చూశాం.సరైన సమయం కోసం వేచి చూస్తుంది. రాజస్థాన్‌లో కూడా మధ్యప్రదేశ్ తరహా ప్రయోగం చేయాలని చూసింది. అక్కడ జ్యోతిరాధిత్య సింథియా అసంతృప్తిని క్యాష్ చేసుకున్నట్టు ఇక్కడ సచిన్ పైలట్‌కు గాలం వేయాలని చూసింది. మధ్యప్రదేశ్‌లో సింథియా విషయంలో జరిగిన తప్పు రిపీట్ కాకుండా అధిష్టానం జాగ్రత్త పడింది.
రాజకీయాల్లో 40, 50 ఏళ్లు ఏమంత పెద్ద వయస్సు కాదు. జ్యోతిరాధిత్య సింథియా, సచిన్ పైలట్ ఇద్దరూ 50 ఏళ్ల లోపు వారే. భవిష్యత్‌లో తప్పకుండా ఆయా రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు అవుతారు. కానీ అంత వరకు వేచి చూసే ఓపిక వారికి లేదు. 60 ఏళ్లు దాటాకే సీఎం పోస్ట్..అప్పుడే ఎందుకంత తొందర అని మనం అనుకోవచ్చు. నిజమే కానీ అది ఒకప్పుడు. ఇప్పుడు యువకులే సీఎం పీఠంపై కూర్చోవటం ట్రెండ్. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు యాబై ఏళ్లు కూడా లేవు రెండో సారి సీఎంగా ఎన్నికల బరిలో పోరాడుతున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా నలబైల్లోని నాయకుడే. కాబట్టి సచిన్ పైలట్ అసహనం అర్థంచేసుకోతగినదే.
2020లో సచిన్ పైలట్ ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశాడు. తన వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీ సమీపంలోని రిసార్ట్‌లో తిష్ట వేశాడు. ఇంకేముంది ఇలాంటి సందర్భం కోసమే ఎదురచూస్తున్న బీజేపీ గేమ్ మొదలు పెట్టింది. అమిత్ షా రంగంలోకి దిగారు. తమదైన శైలిలో సచిన్‌ను లొంగతీసుకోవాలని చూశారు. కానీ రాహుల్, ప్రియాంక సకాలంలో రంగంలోకి దిగి సచిన్ ను బుజ్జగించారు. దాంతో గెహ్లాట్ ప్రభుత్వం బతికిపోయింది. కానీ అప్పటి నుంచి పార్టీలో రెండు వర్గాలుగా చీలిపోయింది. పైలట్ వర్గం అధికారానికి దూరంగా ఉంది. ఆయనకు కూడా ఏ పదవీ లేదు. దాంతో సచిన్ పైలట్ వర్గం ఎప్పుడైనా సహనం కోల్పోవచ్చని గెహ్లాట్‌కు బాగా తెలుసు.
వయస్సు రీత్యా అశోక్ గెహ్లాట్ ఇప్పటికే 70 ఏళ్లు పైబడిన నేత. పైగా ఇప్పటికే రెండు పర్యాయాలు సీఎంగా పనిచేశాడు. కాబట్టి ఆయనను నమ్ముకుని ఎన్నికలకు వెళ్లే పరిస్థితిలో హైకమాండ్ లేదు. ఆయన స్థానంలో పైలట్‌ను సిద్ధం చేయాలని చూస్తోంది. ఇందులో భాగంగానే ఆయన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను క్యాబినెట్‌లోకి తీసుకోవాలని గెహ్లాట్‌ని ఆదేశించింది. దాంతో పైలట్ గ్రూప్ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో స్థానం కల్పించారు. సరిగ్గా గమనిస్తే పంజాబ్‌లో సిద్ధూ విషయంలో అనుసరించిన మార్గాన్నే సచిప్ పైలట్ విషయంలో అనుసరించినట్టు కనిపిస్తోంది.
గెహ్లాట్ పశ్చిమ రాజస్థాన్ కు చెందిన నేత. జోధ్‌పూర్‌కు చెందిన వాడు. అంతా ఎడారి ప్రాంతం. జైసల్మేర్, జోద్‌పూర్, పాలి జిల్లాలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. ఐతే ఇక్కడ కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలవలేదు. ఇది గెహ్లాట్‌కు పెద్ద మైనస్. కాంగ్రెస్ గెలిచిన 102 సీట్లలో 57 స్థానాలు తూర్పు రాజస్థాన్‌కు చెందినవే. ఈ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలకు గెహ్లాట్ గత క్యాబినెట్లో చెప్పుకోదగ్గ ప్రాతినిధ్యం లేదు. కులం జాతి సమీకరణలను పాటించలేదు. గత రెండేళ్లుగా రాజస్థాన్ మంత్రిమండలిలో దళిత ప్రాతినిధ్యం లేదు. కానీ ముగ్గురు బనియా మంత్రులు ఉన్నారు. నిజానికి బనియాలు కాంగ్రెస్‌కు ఓటేయరు. బీజేపీకి వారు సంప్రదాయ మద్దతుదారులు. కాంగ్రెస్‌కు ఓట్లు వేసే బీసీ, ఎస్సీ,ఎస్టీ వర్గాల వారికి మంత్రివర్గంలో ప్రాధాన్యత లేకపోవటం విచిత్రమే. దాంతో కొత్త క్యాబినెట్‌లో దానిని బ్యాలెన్స్ చేశారు. ఇప్పుడు నలుగురు దళితులు, ముగ్గురు గిరిజనులకు స్థానం దక్కింది.
పంజాబ్ ఎక్సర్‌సైజ్‌నే ఇక్కడా చేసింది కాంగ్రెస్ హైకమాండ్. ఇదే సమయంలో రాహుల్, ప్రియాంక పంజాబ్‌లో చేసిన తప్పునే ఇక్కడ రిపీట్ చేస్తున్నారనిపిస్తోంది. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌ను మంత్రులు పదే పదే విమర్శించినా అధిష్టానం పట్టించుకోలేదు. పైగా వారిని ఎంకరేజ్ చేసింది. ఓపెన్‌గా ఎన్నోసార్లు ఆయనపై నోరు పారేసుకున్న సిద్ధూకు పీసీసీ పీఠం కట్టబెట్టింది. అది సీఎంని బలహీన పరిచింది. చివరకు ఈ పంచాయితీలో ఇటు సిద్దు, అటు అమరీందర్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా నష్టపోయింది.
కాంగ్రెస్ పార్టీ మిగిల్చిన మనస్తాపంతో అమరీందర్ సింగ్ కొత్త పార్టీ పెడుతున్నారు. వ్యవసాయ చట్టాలు రద్దు చేస్తే బీజేపీతో కలవటానికి అభ్యంతరం లేదని ఇప్పటికే ప్రకటించాడు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో కమలంతో ఆయన దోస్తీ పక్కా. ఆయనతో పాటు శిరోమని అకాలీదళ్ కూడా తిరిగి ఎన్డీఏ గూటికి చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశం ఏర్పడింది.
సీఎం కావాలన్న ఏకైక లక్ష్యంతో సచిన్ పైలట్ ఉప ముఖ్యమంత్రి, పీసీసీ చీప్ పదవిని వదులుకున్నారు. పంజాబ్,యూపీ ఎన్నికల తరువాత రాజస్థాన్ ముఖ్యమంత్రి మార్పు తప్పదేమో అనిపిస్తుంది. ఐతే అశోక్ గెహ్లాట్‌ను దించటం అమరిందర్ సింగ్ విషయంలో జరిగినట్టు జరగకపోవచ్చు. ఆశోక్ గెహ్లాట్‌కు అమరీందర్‌లా ప్రత్యేక ఓటు బ్యాంక్ ఉన్న నాయకుడు కాదు. పైగా గతంలో ఆయన సారధ్యంలో పార్టీ తిరిగి అధికారం నిలబెట్టుకోలేకపోయింది. కాబట్టి ఆయన నుంచి పెద్దగా ప్రతిఘటన ఉండకపోవచ్చు. అందుకే సచిన్ పైలట్ కు రాష్ట్ర ప్రభుత్వ పగ్గాలు ఇవ్వాలని బావిస్తోంది.
రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి మార్పు పంజాబ్‌లా ఎన్నికలకు ఆరునెలల ముందు ఉంటుందా లేదంటే యూపీ పంజాబ్ ఎన్నికలు ముగిసిన వెంటనే చేపడుతుందా అన్నది చూడాల్సి వుంది. అయితే సీనియర్లను అధికారానికి దూరం పెట్టటం కాంగ్రెస్‌కు ఇబ్బందిగా మారింది. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు సీనియర్లకు గవర్నర్ పదవి ఇచ్చి గౌరవంగా క్రియాశీల రాజకీయాలకు దూరం చేసేది. కాని ఇప్పుడు హస్తం పార్టీకి ఆ ఆవకాశం లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సీనియర్ల విషయంలో ఈ సూత్రాన్నే పాటిస్తోంది. సీనియర్ల నిష్క్రమణకు మార్గదర్శక్ మండలి వంటి వాటిని ఏర్పాటు చేయవచ్చు. కానీ అది కాంగ్రెస్ నేతలను సంతోష పెట్టే అవకాశం లేదు. అందుకే సీనియర్లను అధికారం నుంచి గౌరప్రదంగా తప్పించే మార్గాన్ని కంగ్రెస్ పార్టీ అన్వేషించాల్సిన అవసరం ఉంది. అమరీందర్ సింగ్‌ను అసభ్యకర పద్దతలో తొలగించారు. అశోక్ గెహ్లాట్ విషయంలో అయినా కాంగ్రెస్ హూందాగా వ్యవహరిస్తే బాగుంటుంది.!!
-Dr.Ramesh Babu Bhonagiri