NTV Telugu Site icon

వారిని హెచ్చరించిన బండి సంజయ్…

ఈ నెల 30 వ తేదీన రంగారెడ్డి అర్బన్ జిల్లా లింగోజీగూడ డివిజన్ కు జరుగుతున్న ఉపఎన్నికల సందర్భంగా ఈ ఎన్నికలను ఏకగ్రీవం చేయడానికి రంగారెడ్డి జిల్లా బిజెపి జిల్లా కమిటీ, తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ని కలిసిన సందర్భంగా ఏర్పడిన పరిస్థితులపై, కలవడానికి దారితీసిన పరిస్థితులపై వాస్తవ విషయాలు తెలుసుకోవడానికి మాత్రమే బిజెపి రాష్ట్ర పార్టీ నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా లింగోజిగూడ డివిజన్ నుంచి గెలిచిన ఆకుల రమేష్ గౌడ్ అకాల మరణం వల్ల ఏర్పడిన ఖాళీకి జరుగుతున్న ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ ముందుకు వచ్చి… ఏకగ్రీవం కావడానికి తాము అనుకూలమేనని టిఆర్ఎస్ పార్టీ నేతలు ప్రతిపాదించిన విషయం అందరికి తెలిసిందే. 

దివంగత బిజెపి నాయకుడు రమేష్ గౌడ్ కుటుంబంలోని సభ్యుడికి ఆ డివిజన్ లో కార్పొరేటర్ గా ఏకగ్రీవంగా ఎన్నిక కోసం మార్గం సుగమం చేస్తామని ప్రతిపాదించిన నేపథ్యంలోనే ఈ అంశం చర్చనీయంగా మారింది. గత ఎన్నికలలో ఎల్బీనగర్ లోని అన్ని మున్సిపల్ డివిజన్లలో భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించిన తర్వాత లింగోజిగూడ డివిజన్ లో బిజెపి మరోసారి విజయం సాధించడం ఖాయమని, పోటీ చేయడానికి బిజెపి సిద్ధమైంది. 

అయితే ఈ ప్రత్యేక పరిస్థితులలో రాష్ట్ర పార్టీ నాయకత్వానికి సమాచారం లేకుండా, ఈ విషయాన్ని చర్చించకుండా కేటీఆర్ ను ప్రత్యక్షంగా కలవడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ అంశంలో ఈ బృంద నాయకులు ఎవ్వరు కూడా సీనియర్ నాయకులతో చర్చించకపోవడం, వారి అభివప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా కేటీఆర్ ని కలవడం కూడా పార్టీ ప్రయోజనాలను దెబ్బతీస్తుందని బిజెపి రాష్ట్ర పార్టీ భావిస్తోంది.  ముఖ్యంగా హైదరాబాద్ లో అందుబాటులో ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డితో గాని, డా.కె. లక్ష్మణ్ తో గాని చర్చించకుండా ఈ నిర్ణయం తీసుకోవడం తొందరపాటు చర్యగా రాష్ట్ర పార్టీ భావిస్తోంది.

జరిగిన సంఘటన పట్ల పూర్తిస్థాయిలో విచారణ జరపాలని భావించి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది.  పార్టీ రాష్ట్ర నాయకుల అనుమతి లేకుండా ఉద్దేశపూర్వకంగా కేటీఆర్ గారిని కలిసిన విషయంలో జరిగిన అన్ని విషయాలను నిగ్గుతేల్చాలని బిజెపి రాష్ట్ర పార్టీ భావిస్తోంది. ఈ సంఘటన తర్వాత కొన్ని పత్రికలలో, ప్రచార సాధనాలలో, వెబ్ చానళ్లలో బిజెపి సీనియర్ నాయకులపై తప్పుడు కథనాలను ప్రసారం చేయడాన్ని బిజెపి రాష్ట్ర పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో గాని, వివిధ చానళ్లలో వచ్చిన కథనాలలో ఏమాత్రం వాస్తవం లేదు. ఈ కథనాలన్నీ ఊహజనితమైన అభూతకల్పనలే. ఈ తప్పుడు కథనాలతో పాటు జరిగిన విషయాలపై సమగ్ర విచారణ జరుగుతుంది. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా పార్టీకి నష్టం చేస్తే తగు చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నాం అని తెలిపారు.