NTV Telugu Site icon

Taiwan-China: తైవాన్ రక్షణ అధికారి అనుమానాస్పద మృతి.. కారణమదేనా?

Taiwan Official

Taiwan Official

Taiwan-China: అమెరికా సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ పర్యటనతో తైవాన్-చైనాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. పెలోసీ పర్యటనకు ప్రతీకారంగా తైవాన్‌ చుట్టూ చైనా చేపట్టిన భారీ సైనిక విన్యాసాలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తైవాన్‌ రక్షణ రంగానికి చెందిన ఓ కీలక అధికారి అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. తైవాన్ రక్షణ శాఖ పరిధిలోని పరిశోధన అభివృద్ధి విభాగం డిప్యూటీ హెడ్‌గా పనిచేసే యాంగ్ లీషింగ్ ఓ హోటల్ రూమ్‌లో మరణించినట్టు గుర్తించారు. దక్షిణ తైవాన్‌లోని పింగ్ టంగ్ పర్యటనలో ఇది చోటు చేసుకుంది. యాంగ్ లీషింగ్ ఈ ఏడాది ఆరంభంలోనే చంగ్ షాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వైస్ ప్రెసిడెంట్ పదవిని చేపట్టడం గమనార్హం. పలు క్షిపణుల తయారీ కార్యకలాపాలను ఆయన పర్యవేక్షిస్తుంటారు. ఆయన మృతికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. మయోకార్డియల్ ఇన్ ఫ్రాక్షన్, యాంజీనా పెక్టోరిస్ వల్ల మరణించినట్టు ఫోరెన్సిక్ పరీక్షలో వెల్లడైనట్టు అతను పనిచేసిన ఆర్మీ యాజమాన్యంలోని ఇన్‌స్టిట్యూట్ తెలిపింది

Common Wealth Games 2022: కామన్‌వెల్త్‌లో భారత్‌.. నేటి షెడ్యూల్ 

అయితే, యాంగ్ లీషింగ్ మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ పెలోసీ తైవాన్ లో పర్యటించి వెళ్లిన వెంటనే చైనా ప్రతీకార చర్యలకు దిగడం తెలిసిందే. తైవాన్ చుట్టూ యుద్ధ విన్యాసాలు చేస్తోంది. ఈ తరుణంలో యాంగ్ లీషింగ్ మరణించడమే అనుమానాలకు తావిస్తోంది. చైనా సైనిక విన్యాసాలపై తైవాన్‌ తీవ్రంగా స్పందించింది. తమ ప్రధాన భూభాగంపై దాడికి చైనా సన్నాహాలు చేస్తోందని ఆరోపించింది. తైవాన్‌ జలసంధిలో చైనాకు చెందిన యుద్ధ విమానాలు, నౌకలు భారీ సంఖ్యలో మోహరించి సైనిక విన్యాసాలు చేస్తున్నాయని, కొన్ని చోట్ల నియంత్రణ రేఖను దాటి ఈ నౌకలు తమ జలాల్లో ప్రవేశించాయని తైవాన్‌ రక్షణశాఖ శనివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇవన్నీ చూస్తుంటే డ్రాగన్‌ తమ భూభాగంపై దాడి చేయడం కోసమే ఈ సన్నాహాలు చేస్తున్నట్లు అర్థమవుతోందని పేర్కొంది. విన్యాసాల్లో భాగంగా చైనా క్షిపణులు కొన్ని తైవాన్‌ మీదుగా ప్రయాణించినట్లు కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నాయి. అదే నిజమైతే తైవాన్‌ సౌర్వభౌమత్వాన్ని డ్రాగన్‌ ఉల్లంఘించినట్లే అవుతుంది.