కరోనా మహమ్మారి కారణంగా విద్యాసంస్థలు అన్నీ మూతపడ్డాయి.. కేవలం ఆన్‌లైన్ విద్యకే పరిమితం అయ్యారు.. అయితే, తిరిగి సెప్టెంబర్ 1వ తేదీ నుంచి విద్యాసంస్థలను ప్రారంభించేందుకు సిద్ధమైంది ప్రభుత్వం.. కేజీ నుంచి పీజీ వరకు ప్రత్యక్ష బోధన జరుగుతుందనే ఇప్పటికే సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.. ఇక, విద్యాసంస్థల ప్రారంభానికి ఇదే సరైన సమయం అన్నారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. హైదరాబాద్‌లోని మహబూబియా బాలికల పాఠశాలను ఇంటర్ బోర్డు కార్యదర్శి ఒమర్ జలీల్, పాఠశాల విద్యా కమిషనర్ దేవసేనతో కలిసి సందర్శించిన మంత్రి.. పాఠశాలలో ఏర్పాట్లను పరిశీలించి, విద్యార్థుల.. ఉపాధ్యాయుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని అన్ని విధాలుగా ఆలోచించి.. విద్యాసంస్థల పునః ప్రారంభంపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారన్నారని వెల్లడించారు.
సెప్టెంబర్ 1వ తేదీ వరకు పాఠశాలల్లో అన్ని రకాల సదుపాయాలు పూర్తి చేయాలని ఆదేశించారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి… రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలను యుద్ధ పాత్రిపదికన సిద్ధం చేస్తున్నట్లు చెప్పిన ఆమె.. అన్ని ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు చొరవ చూపుతున్నారని, ఇదే స్ఫూర్తి ముందు కొనసాగాలన్నారు. మంత్రుల నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, జడ్పీ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు పాఠశాలల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సీఎం కేసీఆర్ ఆదేశించారన్న ఆమె.. పంచాయతీల పరిధిలో సర్పంచులు, ఎంపీటీసీలు, మండల స్థాయిలో ఎంపీపీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీల్లో చైర్మన్, కౌన్సిలర్లు, కార్పొరేషన్లలో మేయర్, కార్పొరేటర్లు పాఠశాలలను సందర్శించి, వసతులు ఇతరత్రా ఏర్పాట్లను పరిశీలించాలని స్పష్టం చేశారు. వైరల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. శానిటైజేషన్ పనులను నిర్వహించాలని.. అన్ని రకాల కోవిడ్ జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.