NTV Telugu Site icon

అద్దెకుండే కాలేజీ కుర్రాళ్లతో భార్య ఎఫైర్.. భర్తకి తెలిసి ఏంచేశాడంటే..?

అనుమానం ఒక పెనుభూతం.. ఒక్కసారి మెదడులో అనుమానమొచ్చింది అంటే అది చచ్చేవరకు పోదు. ఇక అందులోను భార్యపై అనుమానం వస్తే ఆ భర్తకు మనశ్శాంతీ దొరకదు. ఆ అనుమానంతోనే ఎంతోమంది కిరాతకంగా మారుతున్నారు. తాజాగా భార్యపై ఉన్న అనుమానం ఒక భర్తను హంతకుడిగా మార్చింది. భార్య వేరేవాళ్లతో వివాహేతర సంబంధం పెట్టుకుందేమోనని అనుమానించిన భర్త, భార్యను అతి దారుణంగా చంపిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో వెలుగుచూసింది.

వివరాలలోకి వెళితే.. ప్రయాగ్ రాజ్‌కు చెందిన బాల్ శ్యామ్ అనే వ్యక్తి భార్య రష్మీ యాదవ్ తో కలిసి నివసిస్తున్నాడు. వారిది రెండంతస్తుల బిల్డింగ్ కావడంతో రెండో అంతస్థులో వారు ఉండి .. మొదటి అంతస్థును అద్దెకు ఇచ్చేవారు. ఇక ఇటీవల కింద పోర్షన్ లో ఉన్న ఫ్యామిలీ ఖాళీ చేయడంతో ఆ ఇంటిని కొందరు కాలేజీ కుర్రాళ్లకు అద్దెకిచ్చారు. అద్దెకు వచ్చిన కుర్రాళ్లు బాల్ శ్యామ్ భార్య రష్మీ యాదవ్ తో చనువుగా మాట్లాడేవారు. దీంతో బాల్ శ్యామ్ కి భార్యపై అనుమానం వచ్చింది.

ఆమె వారితో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. దీంతో వారి మధ్య మనస్పర్థలు చెలరేగాయి. ఈ నేపథ్యంలోనే శనివారం ఉదయం కూడా భార్యాభర్తలు ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో కోపోద్రిక్తుడైన బాల్ శ్యామ్ భార్య రష్మీని పక్కనే ఉన్న రాడ్డుతో తలపై బాది దాడికి పాల్పడ్డాడు. రక్తపు మడుగులో ఉన్న ఆమెను స్థానికులు గుర్తించి ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి బాల్ శ్యామ్‌పై కేసు నమోదు చేయడంతోపాటు అతడిని జైలుకు తరలించారు.