NTV Telugu Site icon

క‌ల‌వ‌ర‌పెడుతోన్న క‌రోనా.. ఢిల్లీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం

Kejriwal

క‌రోనా సెకండ్ వేవ్ భార‌త్‌లో క‌ల్లోల‌మే సృష్టిస్తోంది.. తొలిసారి రోజువారి పాజిటివ్ కేసుల సంఖ్య‌‌ 2 ల‌క్ష‌ల మార్క్‌ను కూడా దాటేసింది.. ఇక‌, దేశ రాజ‌ధాని ఢిల్లీలో కూడా రికార్డు స్థాయిలో కేసులు న‌మోదు అవుతున్నాయి.. కోవిడ్ కేసుల‌కు హాట్ స్పాట్‌గా మారిపోయింది.. దీంతో.. ఢిల్లీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.. వారాంతపు కర్ఫ్యూ విధిస్తున్నట్టు ముఖ్య‌మంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. క‌రోనా ప‌రిస్థితులు, క‌ట్ట‌డికి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై లెఫ్ట్‌నెంట్ గవర్నర్, ఉన్నతాధికారులు, మంత్రులతో చర్చించిన సీఎం కేజ్రీవాల్.. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్న‌ట్టు వెల్ల‌డించారు. ఢిల్లీలో ప్రస్తుతం 5 వేల బెడ్స్ అందుబాటులో ఉన్నాయని, బెడ్స్ కొరత లేదని తెలిపారు. ఈ విషయంలో మీడియా కూడా సంయమనం పాటించాలని, ప్రజలను ఆందోళనకు గురిచేయొద్దన్నారు. సినిమా హాల్‌లో సీటింగ్‌ను 30 శాతానికి కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు ఢిల్లీ సీఎం… మాల్స్, జిమ్స్, ఆడిటోరియం, స్పా మూసివేయాలని ఆదేశించిన ఆయ‌న‌.. విమానయాన, రైల్వే ప్రయాణికులు కచ్చితంగా టికెట్స్ చూపించాలన్నారు. వివాహాలు చేసుకునే వారికి కర్ఫ్యూ పాస్‌లు జారీ చేస్తామ‌ని తెలిపారు. క‌రోనా క‌ట్ట‌డికి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై కేంద్రం.. ఢిల్లీ స‌ర్కార్‌కు నిర్ణ‌యాన్ని వ‌దిలేయ‌డంతో.. కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం అర‌వింద్ కేజ్రీవాల్.