NTV Telugu Site icon

గాంధీలో కరోనా మరణాల కలకలం.. 15 గంటల వ్యవధిలో 35 మంది మృతి ?

 సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో మరణమృదంగం మోగుతోందా ?  కేవలం 24 గంటల వ్యవధిలో 35 మంది ఎందుకు మరణించారు ?  గాంధీలో కరోనా పేషంట్ల  మరణాల రేటు ఎక్కువగా ఎందుకు ఉంటోంది ? అనేది పరిశీలిస్తే కీలక విషయాలు వెల్లడయ్యాయి. 

తెలంగాణలో కరోనా చికిత్సకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన అతి పెద్ద ఆసుపత్రి గాంధీ. ప్రస్తుతం 305 మంది పేషెంట్లు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దాదాపు పదిహేను వందల బెడ్లతో భారీగా ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రిలో ఇప్పుడు కరోనా మరణాలు కలకలం రేపుతున్నాయి.  కేవలం 15 గంటల వ్యవధిలో ఏకంగా 35 మంది మరణించిన దుస్థితి చోటు చేసుకుంది. సోమవారం రాత్రి 10 గంటల నుంచి మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట మధ్యలో ఏకంగా ఇంత ఎక్కువ మరణాలు చోటు చేసుకోవడం  అటు ప్రభుత్వ వర్గాలను, ఇటు ప్రజల్ని షాక్ కు గురిచేస్తోంది. 

కరోనా కారణంగా ఇన్ని మరణాలు చోటు చేసుకుంటున్నా.. వైద్యాధికారులు సీరియస్ గా తీసుకుంటున్న పరిస్థితులు కనిపించడం లేదని వాదనలు వినిపిస్తున్నాయి. పదిహేను గంటల వ్యవధిలో మరణించిన 35 మందిలో 45 ఏళ్లు.. అంతకంటే తక్కువ వయస్సు ఉన్నవారు ఏకంగా తొమ్మిది మంది ఉన్నారు. మిగిలిన వారంతా 46 ఏళ్ల నుంచి 83 ఏళ్ల మధ్యలో వారు. మరణించిన 35 మంది లో 16 మంది మహిళలు కాగా.. 19 మంది పురుషులు. సాధారణంగా మరణాల్లోనూ పురుషుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అందుకు భిన్నంగా.. తాజాగా మహిళల మృతుల సంఖ్య పెరుగుతూ రావడం ఆందోళన కలిగించే అంశమే.. 

పాజిటివ్‌ వచ్చినా తమకేమీ కాదనే ధీమాతో నిర్లక్ష్యం చేసి.. పరిస్థితి విషమించాక చివరి నిమిషంలో ఆస్పత్రిలో చేరడమే ఇందుకు కారణమని వైద్యులు చెబుతున్నారు. మరికొందరేమో.. ప్రైవేటు ఆస్పత్రుల్లో లక్షలు ఖర్చు చేసి, చికిత్స చేయించుకుని వెంటిలేటర్‌పై ఉన్న సమయంలో గాంధీ ఆస్పత్రికి వస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు కరోనాతో వస్తే కొన్ని ఆస్పత్రులు చేర్చుకోవట్లేదు. ఇలా అన్ని ఆస్పత్రులు తిరిగి.. చివరికి గాంధీ ఆస్పత్రికి వస్తున్న వారు ఉన్నారు.  అందువల్ల గాంధీకి తీసుకురావడంతో మరణాల రేటు ఎక్కువగా ఉందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.