Site icon NTV Telugu

Interesting Facts: నదుల్లో కాయిన్స్ ఎందుకు వేస్తారో మీకు తెలుసా?

Coins

Coins

Interesting Facts: చాలా మంది పుణ్యక్షేత్రాలను చూసేందుకు వెళ్లినప్పుడు అక్కడ ఉండే కొలనులు, సరస్సులు, నదుల్లో కాయిన్స్ వేయడాన్ని చాలా మంది గమనించే ఉంటారు. రైలులో వెళ్లేటప్పుడు కృష్ణా బ్రిడ్జి, గోదావరి బ్రిడ్జిలపై నుంచి కూడా ప్రయాణికులు రూపాయి బిళ్లలు నదుల్లో పడేస్తుంటారు. కానీ అలా ఎందుకు వేస్తారో కొంతమందికి తెలియక సందిగ్ధంలో పడుతుంటారు. అయితే నదుల్లో, ఆలయాలలో ఉండే కొలనుల్లో కాయిన్స్ వేయడానికి చాలా కారణాలున్నాయని పెద్దలు వివరిస్తున్నారు. పురాతన కాలంలో రాగి నాణేలను ఎక్కువగా ఉపయోగించేవారు. వాటిని ప్రవహించే నదులు, సరస్సుల్లో వేయడం వల్ల నీరు స్వచ్ఛంగా మారుతుందని నమ్మేవారు.

Read Also: Cyrus Mistry: టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ మృతి

రాగి పాత్రలకు, రాగి నాణేలకు నీటిని శుభ్రం చేసే గుణం ఉంటుంది. ఇది శాస్త్రీయంగా కూడా నిరూపితమైంది. పురాతన కాలంలో రాజులు ఈ విషయంపై ప్రజలకు అవగాహన కల్పించేవాళ్లు. రాగి నాణేలు వేయడం వల్ల నదిలోని నీరు శుభ్రంగా మారుతుందని, దాని వల్ల ఆ నీరు తాగేందుకు పనికొస్తుందని వివరించేవాళ్లు. అందుకే ప్రతి ఒక్కరూ విధిగా ఆ పని చేసే వారు. ఎందుకంటే అప్పటి కాలంలో అందరూ నదిలో లభించే నీళ్లనే తాగేవారు. ఇప్పటి మాదిరిగా ఫిల్టర్లు, మినరల్ వాటర్ అందుబాటులో ఉండేది కాదు. అందుకే రాగి నాణేలను నీటిలో వేసి నీటిని శుభ్రపరిచేవారు. పూర్వకాలం నుండే ఈ విధంగా నదిలో నాణేలు వేయడం ఒక ఆచారంగా ఉండేది. అందుకే దీని వల్ల ఉపయోగం ఏంటనే విషయం కూడా చాలా మందికి తెలియకుండానే ఆచారంగా వస్తోంది. దీన్ని చాలామంది ఫాలో అవుతూ ఉన్నారు. అయితే ప్రస్తుతం రాగి నాణేలు కనుమరుగు అయిపోయాయి. కాబట్టి ఇప్పుడు మనం వాడుతున్న నాణేలను నదిలో వేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. వీటి వల్ల నీరు శుభ్రం కాదు. పైగా ఇప్పుడు వాడుతున్న నాణేలను నదిలో వేయడం వల్ల అవి తుప్పుపట్టి నది నీళ్లు పాడయ్యే ప్రమాదం ఉందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు.

Exit mobile version