తనను తాను టైమ్ ట్రావెలర్ అని చెప్పుకునే ఓ వ్యక్తి 2025 సంవత్సరానికి సంబంధించి కొన్ని షాకింగ్ అంచనాలు వేశాడు. ఆయన చెప్పిన మాటలపై ఇంటర్నెట్‌లో చర్చ జరుగుతోంది. టైమ్ ట్రావెలర్ అని చెప్పుకునే ఎల్విస్ థాంప్సన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో ఆయన కొన్ని తేదీలను సైతం ప్రస్తావించారు. ఈ ప్రత్యేక రోజులలో పెద్ద విధ్వంసక సంఘటనలు జరుగుతాయని చెప్పాడు. అతని వాదనకు సంబంధించిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. లక్షలాది మంది దీన్ని వీక్షించారు. అలాగే.. చాలా మంది ఈ వీడియోపై స్పందించారు. ఆ వీడియోలో ఒక్లహోమాలో వినాశకరమైన సుడిగాలి, అమెరికాలో అంతర్యుద్ధం, సముద్రంలో ఓ పెద్ద జీవిని కనుగొనడం, ఛాంపియన్ అనే గ్రహాంతరవాసుడి రాక, అమెరికాలో భారీ హరికేన్ వల్ల కలిగే వినాశనం వంటి అంశాలను ప్రస్తావించాడు.
ఈ వీడియోలో థాంప్సన్ తాను భవిష్యత్తులోకి వెళ్లి వచ్చినట్లు తెలిపాడు. ఏప్రిల్ 6న 24 కిలోమీటర్ల వెడల్పు, గంటకు 1046 కిలోమీటర్ల వేగంతో ఒక టోర్నడో వస్తుందని, ఇది అమెరికాలోని ఒక్లహోమాను అతలాకుతలం చేస్తుందని ఆయన అన్నాడు. మే 27న అమెరికాలో రెండవ అంతర్యుద్ధం ప్రారంభమవుతుందని అంచనా వేశాడు. ఇది టెక్సాస్ విడిపోవడానికి, అణ్వాయుధాలపై ప్రపంచ సంఘర్షణకు దారితీస్తుందని పేర్కొన్నాడు. చివరికి అమెరికా దీన స్థితికి చేరుకుంటుందని వెల్లడించాడు.
ఈ వైరల్ వీడియోలో థాంప్సన్ మాట్లాడుతూ.. “సెప్టెంబర్ 1న ఛాంపియన్ అనే గ్రహాంతర వాసి భూమిపైకి వస్తాడు. అతను 12,000 మంది మానవులను వారి భద్రత కోసం వేరే గ్రహానికి తీసుకెళ్తాడు. సెప్టెంబర్ 19న అమెరికా తూర్పు తీరాన్ని ఒక భారీ హరికేన్ నాశనం చేస్తుంది. నవంబర్ 3న పసిఫిక్ మహాసముద్రంలో ఒక పెద్ద సముద్ర జీవిని కనుగొంటాం. అది నీలి తిమింగలం కంటే 6 రెట్లు పెద్దదిగా ఉంటుంది. దానికి సిరిన్ క్రౌన్ అని పేరు పెడతారు.” అని థాంప్సన్ పేర్కొన్నాడు. ఆయన అంచనాలపై ఇంటర్నెట్ వినియోగదారులు సందేహాన్ని వ్యక్తం చేశారు. ఎలాంటి అవగాహన లేకుండా స్వయం ప్రకటితంగా తాను ఫ్యూచర్ గురించి చెప్పి జనాలను తప్పుదోవ పట్టిస్తున్నారని, ఇది సరికాదని హెచ్చరించారు.