Site icon NTV Telugu

Pincode: గోల్డెన్ జూబ్లీ పూర్తి చేసుకున్న పిన్‌కోడ్.. అసలు పిన్‌కోడ్ ఎలా పుట్టింది?

Postal Pincode

Postal Pincode

Postal Pincode: ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతోంది. దీంతో దేశమంతటా వజ్రోత్సవాలు జరుగుతున్నాయి. అయితే పోస్టల్ పిన్‌కోడ్ కూడా ఈరోజే గోల్డెన్ జూబ్లీని సెలబ్రేట్ చేసుకుంటోంది. పోస్టల్ స‌ర్వీస్ కు సంబంధించిన పిన్ కోడ్ ఆవిర్భవించి నేటితో 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. పోస్టల్ ఇండెక్స్ నంబర్‌(PIN)ను పిన్‌ కోడ్ లేదా, ఏరియా కోడ్ లేదా జిప్ కోడ్ అని పిలుస్తారు. ఇది 1972 ఆగస్టు 15న ప్రారంభమైంది. దేశంలోని అనేక ప్రాంతాల పేర్లు ఒకేలా ఉండటం, స్థానిక భాషల్లో చిరునామాలు రాస్తుండటంతో అర్థమయ్యేవికాదు. దీనికి పరిష్కారంగా అప్పటి కేంద్ర సమాచారశాఖ సెక్రటరీ శ్రీరామ్ భికాజీ వేలంకర్ ఆరు అంకెల పిన్‌ను ప్రవేశపెట్టారు. అందుకే పిన్‌కోడ్‌లో ఆరు అంకెలు కనిపిస్తుంటాయి.

Read Also: Jio 5G Smart Phone: జియో నుంచి 5జీ స్మార్ట్ ఫోన్.. ధర ఎంత ఉంటుంది?

సంస్కృత భాషా రంగంలో చేసిన కృషికి శ్రీరామ్ భికాజీ వేలంకర్ రాష్ట్రపతి అవార్డును కూడా అందుకున్నారు. ఆయన 1999లో ముంబైలో మరణించారు. పిన్‌కోడ్‌లను ఏరియా కోడ్ లు లేదా జిల్లా కోడ్‌లు అని కూడా పిలుస్తారు. పోస్టల్ ఐడెంటిఫికేష‌న్ నంబ‌ర్ పోస్ట్ మ్యాన్‌కు ఒక లేఖ లేదా ప్యాకేజీని గుర్తించి, ఉద్దేశించిన గ్రహీత‌కు అందించ‌డాన్ని మ‌రింత సుల‌భ‌త‌రం చేస్తుంది. పిన్‌కోడ్‌లో కనిపించే ఆరు అంకెల్లో మొదటి అంకె జోన్‌ను సూచిస్తుంది, రెండో అంకె ఉప జోన్‌ను సూచిస్తుంది. మూడో అంకె జిల్లాను సూచిస్తుంది. చివరి మూడు అంకెలు జిల్లాలోని వ్యక్తిగత పోస్టాఫీసులకు కేటాయించబడతాయి. 1972 ఆగస్టు 15న పిన్‌కోడ్‌ వ్యవస్థను దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టినప్పుడు ఆ సమయంలో భారతదేశం 8 భౌగోళిక ప్రాంతాలుగా విభజించబడింది. 9వ జోన్‌ను ఆర్మీ పోస్టల్ సర్వీస్‌కు రిజర్వ్‌గా ఉంచారు. నేడు దేశంలో మొత్తం 19101 పిన్‌లు ఉన్నాయి. ఇందులో ఆర్మీ పోస్టల్ సర్వీస్ ఉండదు. పిన్‌కోడ్ సహాయంతో వస్తువుల పంపిణీ సులభతరంగా మారింది. సరైన చిరునామాకు ఉత్తరాల పంపిణీ, వస్తువుల పంపిణీ సులభంగా జరుగుతోంది.

Exit mobile version